ఇందిరమ్మ ఇండ్ల కోసం దళారుల మాటలు నమ్మొద్దు : మంత్రి కొండా సురేఖ

ఇందిరమ్మ ఇండ్ల కోసం దళారుల మాటలు నమ్మొద్దు : మంత్రి కొండా సురేఖ
  • ఫ్రీ బస్ స్కీమ్‌‌‌‌తో దేవాదాయ శాఖకు రూ.176 కోట్ల ఆదాయం     

వరంగల్‍/వరంగల్‍ సిటీ, వెలుగు : ‘ఇందిరమ్మ ఇండ్ల కోసం దళారుల మాటలు నమ్మొద్దు, అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వమే ఇండ్లు మంజూరు చేస్తుంది’ అని మంత్రి కొండా సురేఖ చెప్పారు. బుధవారం వరంగల్‌‌‌‌ దేశాయిపేట ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్‌‌‌‌ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, ఇందుకోసం రూ. 22,500 కోట్లు కేటాయించామని చెప్పారు. 

పేదలు, మహిళల సాధికారితే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్‌‌‌‌ ప్లాంట్లు, వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. అంతకుముందు వరంగల్‌‌‌‌ ఆర్టీసీ బస్టాండ్‌‌‌‌లో జరిగిన మహాలక్ష్మి సంబురాల్లో పాల్గొన్నారు. ఫ్రీ బస్సు స్కీమ్‌‌‌‌ ద్వారా దేవాదాయ శాఖ రూ.176 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ స్కీమ్‌‌‌‌ కింద మహిళలు 200 కోట్ల ప్రయాణాలు చేయడం వల్ల వారికి రూ.6,680 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. వరంగల్‌‌‌‌ తూర్పు నియోజకవర్గంలో ఐదు మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా అద్దె బస్సుల నిర్వహణను అప్పగించనున్నట్లు ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో గ్రేటర్‌‌‌‌ మేయర్‍ గుండు సుధారాణి, వరంగల్‍ కలెక్టర్‍ సత్యశారద, ఏసీపీ శుభం, గ్రేటర్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ చాహత్‍ బాజ్‍పాయ్‍ పాల్గొన్నారు.