
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
- ఈ గ్రామాలకు త్వరలో నక్షా మ్యాప్‌లు ఖరారు చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దశాబ్దాలుగా నక్షా (మ్యాప్) లేని 413 గ్రామాల నుంచి ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో రీసర్వేను విజయవంతంగా పూర్తి చేశామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా ఆయా గ్రామాల్లో ‘సర్వే బౌండరీస్ యాక్ట్’ ప్రకారం తుది నక్షా మ్యాప్‌ను ఖరారు చేస్తామని వెల్లడించారు. బుధవారం సెక్రటేరియెట్‌లో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. సీఎం ప్రిన్సిపల్సెక్రటరీ శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్ కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి రాష్ట్రంలో 413 గ్రామాలకు సరైన హద్దులతో కూడిన నక్షాలు లేవని, గత ప్రభుత్వం పదేండ్ల పాలనలో ఈ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో తమ సర్కారు పనిచేస్తున్నదని చెప్పారు. ప్రయోగాత్మకంగా మొదటి దశలో ఐదు గ్రామాల్లో డ్రోన్, ఏరియల్ సర్వే, ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ రోవర్ పద్ధతుల్లో సర్వే పూర్తిచేశారన్నారు. సలార్ నగర్ (మహబూబ్‌నగర్ జిల్లా), కొమ్మనాపల్లి (కొత్తది) (జగిత్యాల జిల్లా), ములుగుమడ (ఖమ్మం జిల్లా), నూగూరు (ములుగు జిల్లా), షాహిద్ నగర్ (సంగారెడ్డి జిల్లా) రీసర్వే చేసిన వాటిలో ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం భూ యజమానులకు నోటీసులు జారీ చేసి, గ్రామసభలు నిర్వహించి, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రతి భూమికి హద్దులు ఖరారు చేయాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, వారు పూర్తి సంతృప్తి చెందే విధంగా నక్షా మ్యాప్‌లు ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.
భూధార్, సర్వే మ్యాప్ తప్పనిసరి!
దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ నంబర్ ఉన్నట్లే, ప్రతి భూమికి భూధార్ నంబర్ కేటాయించాలని ‘భూభారతి’ చట్టం చెబుతున్నదని పొంగులేటి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. ఐదు గ్రామాల్లో భూధార్‌ను అమలు చేయడంతోపాటు, భూముల అమ్మకం మరియు కొనుగోలు సమయంలో హద్దులతో కూడిన సర్వే మ్యాప్‌ను తప్పనిసరిగా జతపరిచే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఐదు గుంటల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూములకు కొత్త సర్వే నంబర్లు కేటాయించాలన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్, దేవాదాయ, వక్ఫ్ భూముల వివరాలను రికార్డుల్లో కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఉన్నతస్థాయి సమీక్షలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సర్వే ల్యాం డ్ సెటిల్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి, ఐదు గ్రామాల ఆర్డీవోలు, తహశీల్దార్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు (సర్వే), సర్వే ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.