నొప్పులొస్తున్నా.. ట్రీట్మెంట్ చేయని డాక్టర్లు

నొప్పులొస్తున్నా.. ట్రీట్మెంట్ చేయని డాక్టర్లు
  • నార్మల్​ డెలివరీ చేయాలంటూ ఆలస్యం
  • చివరికి సిజేరియన్.. బిడ్డ మృతి 
  • డాక్టర్ల నిర్లక్షమే కారణమని బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
  • వనస్థలిపురం ఏరియా హాస్పిటల్​లో దారుణం

ఎల్బీనగర్, వెలుగు: వనస్థలిపురం ఏరియా హాస్పిటల్​లో డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం సూరారం గ్రామానికి చెందిన సమీన (25)కు గతేడాది వనస్థలిపురం చింతలకుంటకు చెందిన హైమత్ అలీ (30)తో పెండ్లి అయ్యింది. ఈ నెల 3న ఫస్ట్ ​డెలీవరి కోసం సమీన వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో చేరింది. బిడ్డ మూడు కిలోలపైనే ఉండగా, డాక్టర్లు సాధారణ ప్రసవం చేస్తామన్నారు.

 నొప్పులు అధికమవడంతో ఆపరేషన్ చేయాలని కుటుంబసభ్యులు కోరినా పట్టించుకోలేదు. గురువారం రాత్రి సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవడంతో సిజేరియన్ చేశారు. అయితే, శిశువు మృతి చెంది ఉండడంతో వైద్య నిర్లక్ష్యమే ఇందుకు కారణమని బాధిత కుటుంబసభ్యులు శుక్రవారం హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు.

 ఆపరేషన్ చేస్తే శిశువు బతికేదని, సాధారణ ప్రసవం చేస్తామని వైద్యులు మెండికేశారని, ముమ్మాటికీ ఇది వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు. గత రెండు రోజులుగా పురిటి నొప్పులతో సమీన బాధపడుతున్నా కనీసం కనికరించలేదని, ఇదే విషయమై గర్భిణి తల్లి పోయి అడిగితే ‘మమ్మల్ని కనమంటావా?’ అని డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. 

ఈ ఏడాదిలో మూడోది

ఈ ఏడాది కాలంలో పుట్టిన బిడ్డలు మృతి చెందిన ఘటనలు ఈ హాస్పిటల్లో ఇది మూడోది. తాజా ఘటనపై వైద్యాధికారి డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఉందా లేదా అని విచారణ చేయిస్తామన్నారు. మొదటి కాన్పు కావడంతో సాధారణ ప్రసవానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గైనకాలజిస్ట్ డాక్టర్ కల్యాణి, స్టాఫ్ నర్స్ సంధ్య, సిబ్బంది రుక్మిణిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.