కొత్త వివాదంలో బేబీ సినిమా.. మేకర్స్పై కేసు నమోదు

కొత్త వివాదంలో బేబీ సినిమా.. మేకర్స్పై కేసు నమోదు

సూపర్ హిట్ బేబీ(Baby) సినిమా కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ తనదేనంటూ సినిమాటోగ్రాఫర్‌ శిరిన్‌ శ్రీరామ్‌ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కథని అనుమతి లేకుండా సినిమా తీశారని చిత్ర నిర్మాత SKN, దర్శకుడు సాయి రాజేష్ పై  ఫిర్యాదు  చేశారు. శిరిన్‌ శ్రీరామ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

ఇంతకు అసలు విషయం ఏంటంటే.. సినిమాటోగ్రాఫర్‌ శిరిన్‌ శ్రీరామ్‌, దర్శకుడు సాయి రాజేష్ మధ్య చాలా కాలం క్రితమే పరిచయం ఉందట. ఆ పరిచయంతోనే తన సినిమాకు సినిమాటోగ్రాఫర్‌ గా వర్క్ చేయాలని శిరిన్‌ శ్రీరామ్‌ కోరాడట దర్శకుడు సాయి రాజేష్. ఆ సమయంలోనే ఈ సినిమా కథను కొన్నేళ్ల క్రితమే డైరెక్టర్‌ సాయి రాజేశ్‌కు  చెప్పాడట శిరిన్‌ శ్రీరామ్‌. అదే కథను ఇప్పుడు బేబీ సినిమాగా తీశారట. దీంతో వాళ్ళు కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించారని, తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు శిరిన్‌ శ్రీరామ్‌. మరి ఈ వివాదంపై బేబీ సినిమా మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

ఇక బేబీ సినిమా విషయానికి వస్తే.. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. చాలా కాలం తరువాత వచ్చిన ప్రేమకథ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. కేవలం రూ.6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.91 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.