అయోధ్య ప్రాణప్రతిష్ఠను పొలిటికల్ ఈవెంట్​గా మార్చారు : రాహుల్ గాంధీ

అయోధ్య ప్రాణప్రతిష్ఠను పొలిటికల్ ఈవెంట్​గా మార్చారు : రాహుల్ గాంధీ

చిపోబోజౌ(నాగాలాండ్) :  అయోధ్యలో రాముడి  విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పొలిటికల్ ఈవెంట్​గా మార్చారని కాంగ్రెస్ మాజీ చీఫ్​, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ‘అయోధ్యలో రాముడి గుడి ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫంక్షన్​గా మార్చారు. దానికి ఎన్నికల రంగు పులిమారు’ అని అన్నారు. అలాంటి రాజకీయ కార్యక్రమానికి తాము హాజరుకాలేమని చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా మంగళవారం నాగాలాండ్​లోని చిపోబోజౌలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘మేం అన్ని మతాలను, సంప్రదాయాలను గౌరవిస్తాం. కానీ అయోధ్య ఈవెంట్​ను ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ చుట్టూ తిప్పుతూ.. రాజకీయ కార్యక్రమంగా మార్చారు. దాన్నో ఎన్నికల ఈవెంట్​గానూ చేశారు. 

అందుకే ఆ ఈవెంట్​కు హాజరుకాబోమని మా పార్టీ చీఫ్ ఖర్గే చెప్పారు. మా కూటమిలోని పార్టీల నాయకులు, మా పార్టీలోని నేతలెవరైనా అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించుకుంటే మాత్రం స్వాగతిస్తాం” అని పేర్కొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఇండియా కూటమి ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కూటమిలోని చిన్న చిన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయి. మేమందరం కలసికట్టుగా పోరాడి, బీజేపీని ఓడిస్తాం. సీట్ల పంపకాలపై చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు. 

రాహుల్​ గాంధీ వే రాజకీయాలు: బీజేపీ 

రాహుల్ చేసిన కామెంట్లపై బీజేపీ మండిపడింది. అయోధ్యపై ఆయనే రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయింది. తాను చెప్పేదే నిజమని ప్రజలు నమ్ముతారని రాహుల్ భ్రమపడుతున్నారని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ‘‘అయోధ్యలో రామమందిర నిర్మాణం దేశంలోని ప్రతి హిందువు కల. అదొక ఎమోషన్. రాహుల్ గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తూ.. అవన్నీ జనం నమ్ముతారని అనుకుంటున్నారు. కానీ దేశ ప్రజలు చాలా తెలివైనోళ్లు. వాళ్లు ఏది నిజమో అర్థం చేసుకోగలరు” అని అన్నారు.

రాహుల్ బస్సులో ఎంట్రీ టికెట్.. 

న్యాయ్ యాత్రలో రాహుల్ ప్రయాణిస్తున్న బస్సుకు ‘మొహబ్బత్ కీ దుకాణ్’ పేరు పెట్టారు. ఈ బస్సులో కి ఎక్కాలంటే టికెట్ తీసుకోవాల్సిందే. ఇందుకోసం స్పెషల్ టికెట్స్ ప్రింట్ చేశారు. ఆ టికెట్లపై రాహుల్ గాంధీ ఫొటో, సంతకం ఉన్నాయి. ఈ టికెట్​ను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘న్యాయ్ యాత్రలో రాహుల్​ను కలిసి మాట్లాడాలనుకునేవాళ్లకు ఈ టికెట్స్ ఇచ్చి బస్సులోకి అనుమతిస్తున్నారు’’   అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.