- సుప్రీంకోర్టులో 1,200 మందికి భారీ ఊరట
న్యూఢిల్లీ, వెలుగు: 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కారుణ్య నియామకం కింద అపాయింటైన 1,200 మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ (ఎంపీహెచ్ఏ) ఉద్యోగులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. దీంతో ఈ 1,200 మంది ఉద్యోగులు సర్వీసులో కొనసాగేందుకు మార్గం సుగమమైంది. 2003లో ఉమ్మడి ఏపీలో 2,300 ఎంపీహెచ్ఏ ఖాళీలను ఇంటర్మీడియట్ డిప్లొమా అర్హతతో నోటిఫై చేశారు. తర్వాత అర్హతను పదో తరగతి + డిప్లొమాగా మార్చారు. ఈ మార్పును సవాల్ చేస్తూ ఇంటర్ అర్హులు హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వానికి చుక్కెదురైంది.
ప్రభుత్వ అప్పీలుతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించి, ఇప్పటికే నియమితులైన వారిని కొనసాగించేందుకు అనుమతించింది. 2012లో పదో తరగతి + డిప్లొమా అర్హతను ధ్రువీకరిస్తూ ఇంటర్ అర్హులను తొలగించారు. దీంతో ఏళ్లుగా పనిచేస్తున్న 1,200 మందిని 2013లో కారుణ్య ప్రాతిపదికన కాంట్రాక్టు ఉద్యోగులుగా ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును రద్దు చేసింది.
