ఖైరతాబాద్ గణేష్​: బడా గణపతి నిమజ్జనం సమయం ఇదే..

ఖైరతాబాద్ గణేష్​:  బడా గణపతి  నిమజ్జనం సమయం ఇదే..
  • మహా గణపతి నిమజ్జనం మధ్యాహ్నంలోపే  

  • ఉదయం 6.30 గంటలకు ఖైరతాబాద్​ నుంచి శోభాయాత్ర షురూ..

  • మధ్యాహ్నం 2 గంటల్లోపు ఎన్టీఆర్​మార్గ్​లో నిమజ్జనం

హైదరాబాద్ సిటీ, వెలుగు: భక్తుల నుంచి విశిష్ట పూజలందుకున్న ఖైరతాబాద్ బడా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహా గణపతి నిమజ్జనం మంగళవారం ( సెప్టెంబర్​ 17)  మధ్యాహ్నం జరగనుంది. దీని కోసం ప్రభుత్వం, నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం కావడంతో సోమవారం( సెప్టెంబర్​ 16)  రాత్రి పదకొండు గంటలకే కలశ పూజ నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు గణనాథుడిని క్రేన్​మీదికి ఎక్కించి, సపోర్టింగ్ వెల్డింగ్​చేశారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకే మహా గణపతి ఊరేగింపు ప్రారంభమయుంది.   ఖైరతాబాద్, లక్డికాపూల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా మధ్యాహ్నం 2 గంటల్లోపు ఎన్టీఆర్ మార్గ్ చేరుకోనుంది. అక్కడ క్రేన్​నంబర్​4 వద్ద నిమజ్జనం నిర్వహించనున్నారు. మండపం నుంచి మహాగణనాథుడిని టస్కర్​పైకి  భారీ క్రేన్​తో ఎక్కించారు. గణేశుడి రెండు వైపులా ఉన్న శ్రీనివాస కళ్యాణం, శివ, పార్వతులు, రాహు కేతువు, అయోధ్య బలరాముడి విగ్రహాలను మరో ట్రక్​లో తరలిస్తున్నారు.

వినాకుడిని దర్శించుకున్న మంత్రి పొన్నం..

 మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​, మేయర్​ గద్వాల విజయ లక్ష్మి ఖైరతాబాద్​గణేశుడిని  సోమవారం దర్శించుకున్నారు. భక్తుల దర్శనాలు నిలిపివేసి మండపం తొలగింపు పనులు చేపట్టడంతో సమయానికి పనులు పూర్తి అయ్యేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.    

350 టన్నుల బరువు ఎత్తే సూపర్​ క్రేన్​  

అందరి దృష్టి ఖైరతాబాద్​ బడా గణేశ్​పైనే ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తయ్యేలా నిర్వాహకులు, అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణేశుడు 70 టన్నుల బరువు ఉండడంతో విజయవాడ నుంచి ఎస్టీసీ ట్రాన్స్​పోర్ట్ కు చెందిన 200 టన్నుల బరువు మోసే సత్తా గల టస్కర్​వాహనాన్ని తీసుకువచ్చారు. మండపం నుంచి విగ్రహాన్ని లిఫ్ట్ చేయడానికి హైదరాబాద్ కు చెందిన రవి క్రేన్స్​ఉపయోగించారు. ఈ క్రేన్​ 200 టన్నుల బరువును కూడా సునాయాసంగా ఎత్తగలదు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయిన శోభాయాత్ర సెన్సేషన్​ థియేటర్​నుంచి టెలిఫోన్​ భవన్, తెలుగు తల్లి చౌరస్తా, సెక్రటేరియట్​ముందు నుంచి ఎన్టీఆర్ ​మార్గ్​ మీదుగా 2 గంటల టైంలో క్రేన్​నెంబర్​4 వద్దకు చేరుకుంటుంది. అక్కడ సూపర్ ​క్రేన్ ​ద్వారా నిమజ్జనం చేస్తారు. 12 వీల్స్​తో నడిచే ఈ సూపర్​ క్రేన్​కు​ 350 టన్నుల బరువును ఎత్తగల కెపాసిటీ ఉంది.  దీని ఒక్కరోజు అద్దె రూ.5 లక్షలని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.