వచ్చే నెల3 నుంచి బడి బాట..9 వరకు డోర్ టూ డోర్ క్యాంపెయిన్ 

వచ్చే నెల3 నుంచి బడి బాట..9 వరకు డోర్ టూ డోర్ క్యాంపెయిన్ 
  • షెడ్యూల్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్టంలో  వచ్చే నెల 3 నుంచి బడి బాట కార్యక్రమం ప్రారంభం కానున్నది. జూన్ 17 వరకు స్పెషల్ ఎన్రోల్ మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. సోమవారం బడి బాటకు సంబంధించిన షెడ్యూల్​ను  స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన విడుదల చేశారు. జూన్ 1న స్కూల్ లెవెల్​లో బడిబాట సన్నాహక సమావేశం నిర్వహించి.. జూన్ 3–9 వరకు అన్ని గ్రామాలు, ప్రాంతాల్లో ప్రత్యేక అడ్మిషన్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు శ్రీదేవ సేన సూచించారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 11గంటల వరకు అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. పిల్లలు సర్కారు బడిలో చేరేలా ర్యాలీలు, బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలతోపాటు డోర్ టూ డోర్  క్యాంపెయిన్ చేపట్టాలన్నారు. మన ఊరు మన బడి, ఇంగ్లిష్ మీడియం, ఎఫ్ఎల్ఎన్​ తదితర సర్కారు స్కీమ్స్ గురించి పేరెంట్స్ కు చెప్పి అడ్మిషన్లు పెంచాలని సూచించారు.  అంగన్వాడీ కేంద్రాల్లో అర్హత కలిగిన స్టూడెంట్లను ఒకటో తరగతిలో చేర్చే విధంగా సమన్వయం చేసుకోవాలని కోరారు. 12 నుంచి 17 వరకూ ప్రతి రోజు బడుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 12న బడుల్లో  వసతులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. బడి ప్రారంభం రోజున ముగ్గులతో అలంకరించి, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని చెప్పారు. 13న ఎఫ్ఎల్ఎన్​(తొలిమెట్టు) కార్యక్రమంపై అవగాహన కల్పించాలని శ్రీదేవసేన తెలిపారు. 14న సామూహిక అక్షరాభ్యాసం జరపి..అదే రోజు బాల సభలు నిర్వహించాలన్నారు. 15న ప్రత్యేక అవసరాలున్న పిల్లలను బడుల్లో చేర్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 16న ఇంగ్లిష్ మీడియం క్లాసులు ప్రారంభం, బైలింగ్వెల్ బుక్స్ పై అవైర్ నెస్ కల్పించాలని స్పష్టం చేశారు. 17న బాలికల విద్య, కెరీర్ గైడెన్స్ పై కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.