బహుజన నేతలు బానిసత్వం వీడాలి

బహుజన నేతలు బానిసత్వం వీడాలి

బందూకులు పట్టి, దొరల దాష్టీకాన్ని ఎదిరించి, దొరల గడీలను స్వాధీనం చేసుకున్న చరిత్ర తెలంగాణ బహుజనులది. ‘దున్నే వారిదే భూమి’ అంటూ పోరాటాలు చేసి దొరలు, భూస్వాముల నుంచి భూములు గుంజుకొని ధిక్కారాన్ని ప్రదర్శించిన తెగువ వాళ్లది. అలాంటి చరిత్ర కలిగిన బహుజన నాయకులు నేడు స్వరాష్ట్రంలో గతంకన్నా ఎక్కువ బానిసత్వంలో బతుకుతున్నారు. ‘నీ బాంఛన్ దొర’ అంటూ స్వాభిమానం లేకుండా జీవిస్తున్నారు. ఈటల ఉదంతంతో బహుజన నాయకుల బానిసత్వం మొత్తం బయటపడింది. దొరకు బానిసలుగా మారి ఇంకో బహుజన నాయకుడి మీదనే యుద్ధం మొదలుపెట్టారు.

బహుజనుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో బహుజనులకు అన్ని రంగాల్లో అన్యాయాలు జరుగుతున్నాయి. వారి అన్యాయాల గురించి, వారి హక్కుల గురించి, వారి అభివృద్ధి గురించి ఏనాడూ సీఎం కేసీఆర్​ దగ్గర మాట్లాడని బానిస లీడర్లు నేడు కత్తి కట్టుకొని ఇంకొక బహుజన నేత పైకి దూసుకురావడం సిగ్గుచేటు. బీసీలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బడ్జెట్​ను ఇప్పుడు తగ్గించినా, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించి రాజకీయ అధికారాలను కొల్లగొట్టినా ఈ లీడర్లు ఎన్నడూ మాట్లాడలేదు. పైగా మరో బహుజన నేతపై దురుసుగా మాట్లాడి మీసాలు మెలేయడం చూస్తుంటే ఎంతటి బానిసత్వంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. బహుజన లీడర్లు ఇలాంటి బానిసత్వంలో కొనసాగుతున్నారు కాబట్టే ప్రశ్నించే వాళ్లను కేసీఆర్  టార్గెట్ చేస్తూ పాలిస్తున్నారు. ఆనాడు టైగర్ ఆలె నరేంద్ర నుంచి ఇప్పుడు ఈటల రాజేందర్ వరకు 40 మంది బహుజన నేతలను ఎంతో అవమానకరంగా టీఆర్​ఎస్​ నుంచి బయటకు నెట్టేశారు. ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించిన కేసీఆర్ ఇంతవరకూ బయటకు వచ్చి ఈటల చేసిన తప్పు ఏమిటో బహిర్గతం చేయలేదు. కానీ  కేసీఆర్​ దగ్గర ఉన్న బానిస నేతలు మాత్రం ఈటలపై అవాకులు, చవాకులు పేలుతూ నిస్సిగ్గుగా  మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వీళ్లంతా ఒకప్పుడు కేసీఆర్​ను తిట్టిన వాళ్లే.  

ఉద్యమ నాయకుడ్ని బర్తరఫ్​ చేస్తే ఖండించరా?
సుదీర్ఘ కాలం తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, ఏడేండ్లు మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్​ను అకారణంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తే బహుజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖండించాల్సిన అవసరముంది. కానీ ఒక్క బహుజన నాయకుడూ ప్రశ్నించలేదు.. ఖండించనూ లేదు. దీన్ని బట్టి చూస్తే ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో నియంతృత్వం ఎంతగా  ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష బహుజన నాయకులు కూడా బానిసత్వం చేస్తున్నారు. ఆంధ్ర పాలనలో బానిసత్వానికి వ్యతిరేకంగా ఆనాడు సబ్బండ బహుజన కులాలు రోడ్ల మీదకు వచ్చి తెలంగాణ ఉద్యమం చేశాయి. కానీ ఆనాటికన్నా నేడే ఎక్కువ బానిసత్వంలో బహుజన లీడర్లు కొనసాగుతున్నట్లు ఈటల ఉదంతం ద్వారా తేటతెల్లమైంది.

అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకేనా?
వాస్తవానికి బర్తరఫ్ చేసిన నాయకుడే ఈటల గురించి మాట్లాడాలి. మాట్లాడాల్సిన కేసీఆర్​ ఫామ్ హౌస్ లో ఉంటే.. ఆయన దగ్గర తొత్తులుగా ఉన్న బహుజన నేతలు మాత్రం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వీళ్లు బానిసలుగా ఉండడానికి కారణం.. అక్రమంగా సంపాదించిన సొమ్మును కాపాడుకోవడంతో పాటు మరింత సంపాదించుకోవడానికనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు మాట్లాడుతున్న గంగుల కమలాకర్, బస్వరాజు సారయ్య, కొప్పుల ఈశ్వర్, వకుళాభరణం కృష్ణ మోహన్, పుట్ట మధు లాంటి బానిస నాయకుల అక్రమ సంపాదన జగమంతా తెలిసిందే. అక్రమ సంపాదన కోసం బహుజన జాతికి ద్రోహం చేస్తే చరిత్రలో బహుజన ద్రోహులుగానే మిగిలిపోతారు. బానిసత్వం వీడకుండా దాసోహం చేసే నాయకులను బహుజన ప్రజలు క్షమించరు. సమయం వచ్చినప్పుడు ఎదిరించి ఓడిస్తారు. కాలం రాగానే కాటేయక తప్పదు. ఇప్పటికైనా బహుజన నేతలు బానిసత్వం వీడి స్వాభిమానంగా జీవించడానికి ప్రయత్నించాలి. 

విభజించి పాలించడమే లక్ష్యమా?
తెలంగాణలో జరగాల్సింది దోపిడీ వర్గాలకు, బహుజనులకు మధ్య యుద్ధం. కానీ బానిస నాయకుల వల్ల అది బహుజన ప్రజల మధ్య యుద్ధంగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సబ్బండ బహుజన కులాలు బాగుపడుతాయని ఆశించి తెలంగాణ ఉద్యమంలో బహుజనులు వారి వారి కులాల గుర్తులతో, వృత్తుల చిహ్నాలతో రోడ్ల మీదికి వచ్చి ఎన్నో రూపాల్లో ఉద్యమం చేశారు. గౌండ్ల వాళ్లు మోకు ముత్తాదుతో, ముదిరాజ్ లు, బెస్తలు చేపలు పట్టే వలలతో, బహుజన మహిళలు బోనాలతో రోడ్ల మీదకు వచ్చి పోరాడారు. అలాంటి తెలంగాణ గడ్డలో నేడు బహుజన ప్రజలను విభజించి పాలించడమే లక్ష్యంగా పాలన కొనసాగుతోంది. ముదిరాజ్ ప్రజలను వాడుకొని గత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను మట్టి కరిపించిన కేసీఆర్​.. నేడు కాపులను, ఎంబీసీలను రంగంలోకి దించి ముదిరాజ్​లపైకి ఉసిగొల్పుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పిదాల వల్ల మొదటిసారి గద్దెనెక్కిన కేసీఆర్.. పాలించడానికి సరిపడా ఎమ్మెల్యేల బలమున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను అదిరించి, బెదిరించి, కొనుగోలు చేసి టీఆర్ఎస్​లో  కలుపుకున్నారు.  రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పనిచేశారు. ప్రజా సమస్యలపై నిలబడి పోరాడే నాయకులు లేకుండా చేసి, అటు నాయకులను ఇటు ప్రజలను బానిసలుగా చేసి విభజించి పాలిస్తున్నారు. ఈ కుటిల రాజకీయాలను బహుజన సమాజం అర్థం చేసుకొని తిప్పికొట్టాలి. బహుజన బుద్ధిజీవులు, విద్యావంతులు,  మేధావులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రగతిశీలవాదులు బహుజన ఐక్యత కోసం కృషి చేయాలి. మహాత్మ జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్  కలలుకన్న రాజ్యాధికారం చేపట్టాలి.  

- సాయిని నరేందర్, బీసీ స్టడీ ఫోరం, వ్యవస్థాపక చైర్మన్.