సైద్ధాంతిక భూమిక మరిచిన బహుజన వాదం!

సైద్ధాంతిక భూమిక మరిచిన బహుజన వాదం!

కుల సంస్కరణకు సంబంధించి ఏవైనా పేర్లు చెప్పమని యాక్టివిస్టులనో, కుల సంఘాలను నడిపే చోటామోటా నాయకులనో అడిగితే రెండు పేర్లు ఠక్కున చెప్తారు. మొదటిది డా. బీఆర్ అంబేద్కర్, రెండోది జ్యోతిబాఫూలే. ఇక పేర్ల చుట్టూ తోకలు తగిలించుకొని కుల సంఘాలను నడిపేవారే ‘కుల నిర్మూలన’ గురించి మాట్లాడుతుంటారు. వీళ్ల ‘సంఘ నిర్మాణం’ అంతా ఇప్పుడు అగ్రకులాలని పిలిచే వారిపై ‘ద్వేషం’తో  నిర్మితమైనదే! పెద్ద కులాలుగా చెప్పేవారి ‘సంఘ శక్తి’ అంతా రాజకీయ అధికారం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక బీసీ కులాల వారంతా చిన్న చిన్న సంఘాలుగా విడిపోయి ఉంటారు. వృత్తి ఆధారంగా జీవించే కులాల్లో ‘బంధం’ బాగా ఉంటుంది. అయితే కుల గౌరవాలు పౌరుషాలుగా మారినప్పుడే రాజకీయపార్టీలు ఆయా కులాలను గౌరవించడం మొదలుపెట్టాయి. ఓట్ల సంఖ్యనుబట్టి ఎజెండా తయారయ్యే స్థితికి ఈ చిన్న సమూహాలే పార్టీలను దారిలోకి తేగలిగాయి. ‘కుల నిర్మూలన’ అనే గొప్ప గ్రంథం రాసి ‘కులం చట్రంలో మీరు ఓ జాతిని గానీ, నీతిని గానీ నిర్మించలేరు’ అని చెప్పిన డా. బీఆర్​అంబేద్కర్​పేరు చెబుతూనే ‘కుల భవనాలు’ నిర్మిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తున్నది. మొత్తానికి ఇప్పుడు మనకు కుల నిర్మూలన కావాలా? కులతత్వ నిర్మూలన కావాలా? అన్నది ప్రశ్న.

మొదటి నుంచే నిర్మూలన ప్రయత్నం..

నిజానికి భారతీయ సమాజంలో కులం ఓ సామాజిక రుగ్మతగా మారింది. ఈ రోగానికి మందు వేసేందుకు ఈ కులం ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచే సంస్కరించే ప్రయత్నం కూడా మొదలైంది. సామాజిక సమరసత నిర్మాణం చేసే సదుద్దేశంతో ఎందరో తాత్వికులు భారతీయ దృక్కోణంతో కుల సంస్కరణ మొదలు పెట్టారు. రామాయణానికి సంబంధం లేని, తలాతోక లేని కథలతో ఉన్న ఉత్తరకాండలోని ‘శంభూకవధ’ ఘట్టం చూపించి త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వారు రాముడిని బోనులో నిలబెడతారు. కానీ అదే రాముడు అసలైన రామాయణంలో నిషాదుడైన గుహుడిని, వానరులైన అంగద, జాంబవంత, సుగ్రీవ, హనుమలతో గడిపిన జీవితం బయటపెట్టరు? ఆదివాసీ శబరిని కలుసుకోవడం గురించి గానీ, మాతంగమహర్షి  వంటి వారితో రాముడికున్న అనుబంధం వీళ్ల ఎర్రకళ్లకు కనిపించదు. అసలు రామాయణకర్త వాల్మీకి మహర్షి జీవితం గురించి ఎవరూ మాట్లాడరు. ఏకలవ్యుడి వేలు తెంపిన ద్రోణాచార్యుడి పాత్ర, తమరాజ్యంలో కులతత్వం లేకుండా నిషేధాజ్ఞలు జారీ చేసిన కృష్ణుడు, కర్ణుల పాత్రలనూ వ్యాసమహర్షి తీర్చిదిద్దాడు. శ్రీకృష్ణుడు దాసీ పుత్రుడైన విదురుని ఇంటికి వెళ్లి భోజనం చేశాడు.  మహాభారతంలో విదుర నీతికి ఉన్న  ప్రాముఖ్యత ఈరోజుకూ ఉదాత్తమైంది. ఇదంతా గంగపుత్రుల అమ్మాయి కడుపులో పుట్టిన వ్యాసమహర్షి విరచితమే. ధర్మరాజు నహుష సంవాదంలో ‘గుణం గొప్పగా ఎవరికి ఉంటే వారే బ్రాహ్మణులు’ అని చెప్పించిన వ్యాసుడిని గొప్ప సంస్కర్తగా మనం చూస్తున్నామా?

తాత్వికంగా సాగించిన  నిశ్శబ్ద విప్లవం

కవశ ఐలుశులనే ఇద్దరు శూద్రకులస్థులు వేద సూత్రాలను చెప్పారంటే నమ్ముతామా? అరుంధతి ఎవరు? జమదగ్ని భార్య రేణుక ఎవరు? ఇదంతా ఇతిహాసం. మనకు నచ్చదు?  కులతత్వం పోగొట్టేందుకు రాశిపోసేంత సాహిత్యం సృష్టించిన ఆళ్వార్లు, నయనార్ల యోగదానం మనలో ఎందరికి తెలుసు? 15 వందల ఏండ్ల క్రితమే దళితజాతి ఉద్ధరణకు కృషి చేసి, అందులో భాగంగా తన ప్రాణం వదిలిన నందనార్​జీవితం గురించి ఎవరికైనా పట్టిందా? ఆళ్వార్లు, నయనార్లలో స్త్రీ, శూద్ర, దళిత కులస్థులు ఉన్నారన్న స్పృహ సోకాల్డ్​కుల సంస్కరణవాదులకు  ఉందా? శ్రీరంగంలో లోకసారంగముని వంటి కులవాది మెడలు వంచి మునివాహసేవ పొందిన తిరుప్పాణి ఆళ్వారు శ్రీరంగనాథుడికి ప్రీతిపాత్రుడన్న సత్యం ఎవరికి చెప్పాలి? అందరిలోని ఆత్మతత్వం గుర్తు చేసిన శంకరుడు, అందరికీ నారాయణ మంత్రం చెప్పిన రామానుజుడు 12వ శతాబ్దంలోనే ఈనాటి పార్లమెంటులా అనుభవ మంటపం స్థాపించి అందులో అన్ని కులాల వాళ్లకు స్థానమిచ్చిన, మహాత్మ బసవేశ్వరుడి వచనం ముఖం చూడని వారు ఈరోజు కుల నిర్మూలన గురించి మాట్లాడుతుంటారు. 12వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు, చాపకూడు, 15వ శతాబ్దంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, అన్నమయ్య అందరిదీ సంస్కరణా దృష్టే. మీరాబాయి. తుకారం, జ్ఞాన్​దేవ్, శంకర్​దేవ్, చైతన్య మహా ప్రభు, నర్సీ మెహతా.. వంటి మధ్యయుగ సంస్కర్తల భక్తి ఉద్యమం ఈ దేశంలో జడలు విప్పిన కులతత్వంపై చేసిన మహాయుద్ధం. దయానంద సరస్వతి, వివేకానంద, మహాత్మా గాంధీ, రామ్​మనోహర్​లోహియా హృదయపూర్వకంగా కులం అహంకారంపై తిరుగుబాటు చేసినవారే. నారాయణ గురు సాగించిన ‘ధర్మ పరిపాలన యోగం’ కేరళలో కులం కుళ్లును కడిగేసింది. ఇదంతా తాత్వికంగా సాగించిన  నిశ్శబ్ద విప్లవం.

మార్క్స్​కళ్లతో ..

దళితజాతి ఉద్ధరణకు అంబేద్కర్​​జీవితాంతం అవిశ్రాంత పోరాటం చేశాడు. విదేశాల్లో చదువుకొని ఈ కులంపై కేవలం థియరీ మాత్రమే తెలిసిన వాడు కాదు ఆయన. తను తన జీవితంలో ఎన్నో అవమానాలకు గురయ్యాడు. అందువల్ల ఆయన మహద్ చెరువు పోరాటం అయినా, మనుస్మృతి దహనం అయినా విప్లవకారుడిలా చేశాడు. తన విప్లవోద్యమాల రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన స్వాతంత్ర్యం, తాను రాజ్యాంగం రాశాక రాజకీయంగా అధికార  వర్గాన్ని ఎదుర్కోవడంలో దెబ్బతిన్నాడు. అలాగే మునుపటిలా సంఘర్షణతో కాకుండా సమన్వయంతో తాత్విక దృక్కోణంలో కులతత్వాన్ని ఎదుర్కోవాలని సంకల్పించాడు. ధర్మం, సంఘం శరణమన్న, బహుజనహితాయ.. బహుజన సుఖాయ అని బోధించిన బుద్ధుడి మార్గంలో నడిచాడు. ​1956 అక్టోబర్​14న తన అనుచరులతో బౌద్ధం స్వీకరించిన అంబేద్కర్​​6 డిసెంబర్​1956లో మరణించాడు. బాబా సాహెబ్ ​
బౌద్ధం వెలుగుతో ఎలా సమన్వయం 

సాధించేవాడో తెలియదు. కానీ ఇటీవల బహుజనవాదం ప్రబోధిస్తున్న కుల సంఘాలు, పార్టీలు ఎక్కడో పుట్టిన మార్క్స్​కళ్లతో మన దేశంలో కుల సంస్కరణ గురించి మాట్లాడటం అవివేకం. నేటికీ కమ్యూనిస్టు పార్టీల్లో దళితులకు ఒక్క కీలక పదవి ఇవ్వని సంగతి కింది స్థాయిలో పనిచేసే బహుజనులకు తెలియదు. చార్మినార్ ​నియోజకవర్గంలో 200 ఓట్లు కూడా రాని కమ్యూనిస్టు పార్టీలు ‘హిందూ మతోన్మాదం’ అంటూ బహుజనవర్గాల భుజాలపై తుపాకి పెట్టి కాలుస్తాయి. మొట్టమొదట బహుజనవర్గాల దృక్పథం ‘కులసంస్కరణ’  విషయం భారతీయం అవ్వాలి. అలాగే నినాదాలు, ఎరల వలల్లో చిక్కకుండా స్వీయతాత్విక భూమిక నిర్మించుకోవాలి. 

దిక్సూచి లేని వాదం

మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది? బహుజనవాదం దిక్సూచి లేకుండా ముందుకు వెళ్తుంది అన్నదానికి ఒక ఉదాహరణ. 8 శతాబ్దాలు పాలించిన వాళ్లు హిందూమతంలోని కులతత్వాన్ని ప్రశ్నిస్తే నవ్వొస్తుంది. మరి అన్నాళ్లు పాలించిన వారు ఈ కుల జాడ్యాన్ని ఎందుకు వదిలించలేదని ఏ కుల సంఘం అడక్కపోగా.. బహుజనవాదంలో వాళ్లనూ భాగస్వాములను చేయాలని చూస్తున్నారు. ఒకసారి బాబాసాహెబ్ రాసిన పాకిస్తాన్ విభజన పుస్తకం చదవాలి. ఎక్కువగా సంఖ్యాబలం ఉన్న వారి నోటికాడి రిజర్వేషన్లు లాగి మత రిజర్వేషన్లు సృష్టిస్తే నోరుమెదపని వాళ్లు ఇటీవల కేంద్ర హోమంత్రి అమిత్ షా వివిధ కులాల ఫలాలు వాళ్లకే దక్కేలా చూస్తాం అంటే మండిపడుతున్నారు. ఈ దేశంలో కులం ఆధారంగానే రిజర్వేషన్లు వచ్చాయి అన్నది అవిస్మరణీయం. మరి ఈ ఫలాలు మతపరంగా ఎన్నో హక్కులు అనుభవిస్తున్న మైనార్టీల ఖాతాలో వేస్తామంటే ఎలా? 

- డా. పి. భాస్కరయోగి,సామాజిక,  రాజకీయ విశ్లేషకుడు