3 నెలల తర్వాత సంజయ్ రౌత్ కు బెయిల్

3 నెలల తర్వాత సంజయ్ రౌత్ కు బెయిల్

శివసేన లీడర్, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు బెయిల్ మంజూరైంది. ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.  రౌత్ బెయిల్ పిటిషన్‌పై అక్టోబరు 21న విచారణ ముగించిన ప్రత్యేక న్యాయస్థానం.. తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా తీర్పును వెలువరిస్తూ బెయిల్‌ను మంజూరు చేసింది.  గత మూడు నెలలుగా సంజయ్ రౌత్ జైలులో ఉన్నారు. ముంబైలోని రెసిడెన్షియల్ కాలనీ రీ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆగస్టు 1న కస్టడీలోకి తీసుకుంది.

మనీలాండరింగ్ చట్టం కింద అరెస్టు కావడానికి ముందు ఆయన రెండుసార్లు ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని రౌత్ ఆరోపించారు. శివసేన పార్టీ తమదేనంటూ ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాల మధ్య పోరు జరుగుతున్న తరుణంలో రౌత్‌ను ఈడీ అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి షిండే శిబిరం బీజేపీతో జతకట్టడాన్ని రౌత్  తీవ్రంగా వ్యతిరేకించారు.