జూబ్లీహిల్స్ బాలిక కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్

జూబ్లీహిల్స్ బాలిక కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్

రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ పబ్ ఘటనలో ఏ1గా ఉన్న ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ ఏడాది మే 28న జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా  పబ్‌లో పార్టీ జరిగిన తర్వాత 17 ఏళ్ల  బాలికపై ఐదుగురు మైనర్లు మరో మేజర్ యువకుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో రాజకీయ ప్రముఖుడి కుమారుడు ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. బాలిక కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను మైనర్లుగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. మే 28న అత్యాచార ఘటన చోటుచేసుకోగా,  మే 31 వరకూ ఘటన గురించి బాలిక తన తల్లిదండ్రులకు చెప్పలేదు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మే 31న జూబ్లీ హిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగడంతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు.  ప్రతి సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి.. కేసు విచారణ చేపట్టారు. తాజాగా సాదుద్దీన్ మాలిక్ కు కూడా బెయిల్ మంజూరవడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురికీ బెయిల్ మంజూరైనట్లు అయింది.