
- డీల్ విలువ రూ.7,765 కోట్లు
న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆస్ట్రియన్ బైక్ తయారీ సంస్థ కేటీఎంలో మెజార్టీ వాటాను కొనుగోలు చేస్తామని బజాజ్ ఆటో గురువారం ప్రకటించింది. తన సబ్సిడరీ కంపెనీ బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ బీవీ (బీఏఐహెచ్‌బీవీ) ద్వారా సొంతం చేసుకోనుంది. డీల్ విలువ రూ.7,765 కోట్లు (800 మిలియన్ యూరోలు) ఉండొచ్చని అంచనా. అవసరమైన అప్రూవల్స్ రాగానే కేటీఎంలో మైనార్టీ షేర్‌హోల్డర్‌గా ఉన్న బజాజ్ ఆటో, మెజారిటీ ఓనర్‌గా మారుతుంది.
ఇండియాలో కేటీఎం బిజినెస్‌ను జాయింట్‌గానే కొనసాగిస్తామని కంపెనీ వెల్లడించింది. ఇండియాలో బైక్‌లను డెవలప్ చేసి, తయారు చేసి, అమ్ముతామని, అలానే కేటీఎం నెట్‌వర్క్ ద్వారా 80 దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తామని తెలిపింది. బీఏఐహెచ్‌బీవీ 800 మిలియన్ యూరోల డెట్ ఫండింగ్ ప్యాకేజీ ద్వారా డీల్ పూర్తి చేస్తుంది. ఇప్పటికే 200 మిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేసింది.