వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆస్తులపై విచారణ జరపాలంటూ ఈడీకి బక్క జడ్సన్ ఫిర్యాదు

వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆస్తులపై విచారణ జరపాలంటూ ఈడీకి బక్క జడ్సన్ ఫిర్యాదు

వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై బుధవారం (ఆగస్టు 16న) హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేశారు ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ నేత బక్క జడ్సన్. ఆరూరి రమేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో 2014, 2018లో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు ఎలా పెరిగాయో విచారణ చేయాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భూ కబ్జాలు చేస్తూ అక్రమంగా ఆస్తులు సంపాదించారని.. దీనిపై ఏసీబీ డైరెక్టర్ కూడా దర్యాప్తు జరపాలని కోరారు.

ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై గతంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చాలుసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు బక్క జడ్సన్. అందుకే ఎమ్మెల్యే రమేష్ ఆస్తులపై విచారణ జరిపించాలని ఈడీ డైరెక్టర్ ను కోరానన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు భూ కబ్జాలతో పెరిగిపోయాయని చెప్పారు బక్క జడ్సన్. నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమిస్తూనే.. పేద ప్రజల వ్యవసాయ అసైన్డ్ భూములపై కన్నేసి లాక్కుకుంటున్నాని ఆరోపించారు. వర్ధన్నపేట నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇదే మాదిరిగా అక్రమంగా ఆస్తులు సంపాదించారని బక్క జడ్సన్ ఆరోపించారు.

* 2014లో ఎన్నికల సందర్భంగా అఫిడవిట్ లో ఆరూరి ప్రకటించిన మొత్తం ఆస్తులు రూ.14 కోట్ల 84 లక్షలు

* 2018లో ఎన్నికల సందర్భంగా అఫిడవిట్ లో ఆరూరి ప్రకటించిన మొత్తం ఆస్తులు 28 కోట్ల 39 లక్షలు

నాలుగేళ్లలో 100 శాతం ఆస్తుల విలువ ఎలా పెరిగిందని బక్క జడ్సన్ ప్రశ్నించారు.