- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
గోదావరిఖని, వెలుగు: రామగుండంలో లెదర్ పార్క్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. సోమవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లింగాపూర్ లో ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. లెదర్ పార్క్ కు తగిన భూమి లేనందున మరో చోట 25 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. పార్క్ నిర్మాణం పూర్తయితే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని వివిధ పరిశ్రమల్లోని ఉద్యోగులు, కార్మికులకు చెప్పులు, షూలు అందుబాటులోకి రానున్నాయని, స్థానిక యువతకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా లింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమి సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో నష్టపోయిన ఎస్సీల ఇండ్ల కోసం కేటాయించారని, ఇప్పుడు తమకు తిరిగి ఇవ్వాలని దళితులు చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రామగుండం గురుకుల కాలేజీని సందర్శించి స్టూడెంట్ల సమస్యలను అడిగి తెలుసుకుని భోజనం చేశారు. ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కమిటీ చైర్మన్ కాంపెల్లి సతీశ్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా.. తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
చైర్మన్ వెంట రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, రేణికుంట్ల ప్రవీణ్, లీలా దేవి, రాంబాబు నాయక్, జిల్లా శంకర్, రామగుండం కమిషనర్, అడిషనల్కలెక్టర్ అరుణ శ్రీ, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ తూము రవీందర్, లీడ్‌క్యాప్ ఆఫీసర్లు దిక్కు నాయక్, విజయ్‌కుమార్, బొంకూరి మధు, మైస రాజేశ్, బాపయ్య, కాంపెల్లి సతీష్, గ్రామస్తులు ఉన్నారు.
