పాట్నా: బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న (గురువారం) ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీయే కూటమి నేతలు హాజరుకానున్నారు. ఇక ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్ కుమారే బాధ్యతలు చేపడతారని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. నితీశ్ కుమారే సీఎం కాబోతున్నారని బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు.
‘‘మంగళవారం బీజేపీ ఎల్పీ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత ఎన్డీయే ఎల్పీ మీటింగ్ ఉంటుంది. అందులో నితీశ్‌ను లీడర్‌గా ఎన్నుకుంటం. ఆయనే కొత్త సీఎం” అని బీజేపీ లీడర్ తారాకిశోర్ ప్రసాద్ తెలిపారు. కాగా, ప్రస్తుత ప్రభుత్వ చివరి కేబినెట్ మీటింగ్ సీఎం నితీశ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది.
ఇందులో ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. అనంతరం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను నితీశ్ కలిసి కేబినెట్ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆయన బుధవారం తన రాజీనామాను గవర్నర్‌కు అందజేయనున్నారు.
