హైదరాబాద్: సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై రాష్ట్రీయ వానర సేన సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల వారణాసి చిత్ర ప్రచార కార్యక్రమంలో.. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమౌళిపై కేసు నమోదు చేసి.. భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు పోలీసులను కోరారు. RFCలో జరిగిన Globe Trotter ఈవెంట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు.
అయితే.. ఆ అసహనం హనుమంతుడిపై వ్యక్తం చేయడంతో అంజన్న భక్తులు రాజమౌళిపై మండిపడుతున్నారు. తనకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదని, తన తండ్రి మాట్లాడుతూ.. హనుమ వెనకాల ఉంటాడని, గుండె తట్టి నడిపిస్తాడని చెప్పారని.. తనకు వెంటనే కోపమొచ్చిందని.. ఇదేనా నడిపించేదని రాజమౌళి వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై హనుమాన్ భక్తులు తీవ్రంగా మండిపడ్డారు. మానవ తప్పిదాలకు దేవుడిని నిందించడం ఏంటని రాజమౌళిని నిలదీశారు.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ భారీ అడ్వెంచరస్ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘గ్లోబ్‌ట్రాటర్’ పేరుతో ఆర్‌ఎఫ్‌సీలో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించిన రాజమౌళి టీమ్.. ఈ వేదికపై ‘వారణాసి’ అనే టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్, ‘వారణాసి టు ది వరల్డ్’ పేరుతో వీడియోను విడుదల చేశారు.
యుగాలు, ఖండాలతో కూడిన అద్భుతమైన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సాగిన ఈ వీడియో చివర్లో.. వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో చేతిలో త్రిశూలం పట్టుకుని ఎద్దుపై వస్తున్న మహేష్ బాబు లుక్ ఇంప్రెస్ చేసింది. అలాగే వేదికపై కూడా ఎద్దు బొమ్మపై కూర్చుని మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వడం ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది.
