కేసీఆర్ అపాయింట్​మెంటైనా ఇవ్వలే : బాలగౌని బాలరాజు గౌడ్

కేసీఆర్ అపాయింట్​మెంటైనా ఇవ్వలే : బాలగౌని బాలరాజు గౌడ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  పదేళ్లలో కల్లు గీత వృత్తికి రక్షణ కరువైందని తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్ పేర్కొన్నారు. ఇదే విషయంపై ఎన్నోసార్లు అప్పటి సీఎం కేసీఆర్​ను స్వయంగా కలిసి.. గౌడ సంఘాల సమస్యలపై వినతిపత్రం సమర్పించడానికి ప్రయత్నించామని.. అపాయింట్​మెంట్ కూడా ఇవ్వకుండా దాటవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ గడప తొక్కని కులం ఏదైనా ఉందంటే అది గౌడ్​లు మాత్రమేనని తెలిపారు.

 శుక్రవారం చిక్కడపల్లిలోని సమన్వయ కమిటీ రాష్ట్ర ఆఫీసులో మీడియా సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ ఆయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ ఎలికట్టె విజయ్ కుమార్​తో కలిసి ఆయన మాట్లాడారు. గౌడ్​ల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కల్లుగీత వృత్తిదారులకు 5 వేల పెన్షన్, కార్పొరేషన్​కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ప్రమాదంలో మరణించిన తీవ్రగాయాల పాలైన గీత వృత్తిదారులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ప్రమాదాల నివారణకు సేఫ్టీ పరికరాలు అందజేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి బాలరాజ్​ గౌడ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.