శివబాలకృష్ణ అక్రమాస్తులు రూ.450 కోట్లు

శివబాలకృష్ణ అక్రమాస్తులు రూ.450 కోట్లు
  • శివబాలకృష్ణ అక్రమాస్తులు రూ.450 కోట్లు
  • 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్స్
  • బినామీల పేర్లతో రూ.250 కోట్లు విలువ చేసే ప్రాపర్టీలు
  • మార్కెట్ వాల్యూ ప్రకారం వందల కోట్ల ఆస్తులు
  • కస్టడీ ముగియడంతో జైలుకు తరలింపు
  • బినామీ శివ నవీన్‌‌కుమార్‌‌‌‌ అరెస్ట్, రిమాండ్‌‌
  • ఏసీబీ అదుపులో బాలకృష్ణ మేనల్లుడు భరత్ 

హైదరాబాద్‌‌, వెలుగు:  హెచ్‌‌ఎమ్‌‌డీఏ టౌన్‌‌ ప్లానింగ్‌‌ మాజీ డైరెక్టర్‌‌, రెరా సెక్రటరీ‌‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా బయటకొచ్చింది. ఆయనకు 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్స్‌‌, విల్లాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌‌ వ్యాల్యూ ప్రకారం రూ.250 కోట్ల కంటే రెట్టింపు ఉంటుందని అంచనా వేశారు. ప్రాంతాల వారీగా చూసుకుంటే వీటి విలువ దాదాపు రూ.650 కోట్లు దాటే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను గత నెల24న  ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. బుధవారంతో కస్టడీ ముగియగా నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌‌గూడ జైలుకు తరలించారు.

అక్రమాస్తులన్నీ బినామీల పేర్లతోనే

శివబాలకృష్ణకు బినామీగా ఉన్న ఆయన సోదరుడు శివ నవీన్‌‌కుమార్‌‌‌‌ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్‌‌కు తరలించారు. మరో బినామీగా ఉన్న ఆయన మేనల్లుడు భరత్‌‌కుమార్‌‌‌‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో మేనల్లుడు, బాలకృష్ణ భార్య రమాదేవి, నవీన్ భార్య పేరుతో సహా బంధువులు, స్నేహితులపేర్లతో బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 

మూడు శాఖల్లో క్విడ్ ప్రో కో

హెచ్‌‌ఎమ్‌‌డీఏ టౌన్ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా, రెరా ఇన్​చార్జి సెక్రటరీగా, మెట్రో రైల్‌‌ చీఫ్ జనరల్ మేనేజర్‌‌‌‌గా విధులు నిర్వహించిన సమయంలో శివబాలకృష్ణ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. క్విడ్ ప్రో కో తరహాలో ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు సేకరించారు. హెచ్‌‌ఎమ్‌‌డీఏ, రెరా, మెట్రో రైలులోని శివబాలకృష్ణ చాంబర్స్‌‌లో సోదాలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. హెచ్‌‌ఎమ్‌‌డీఏ పరిధిలోని ఔటర్‌‌‌‌ రింగ్‌‌ రోడ్డు, రీజినల్ రింగ్‌‌ రోడ్డు పరిసర ప్రాంతాలు సహా పుప్పాలగూడ, నార్సింగిలోని ప్రాజెక్ట్‌‌లకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

జనగాంలో102 ఎకరాలు భూమి

శివబాలకృష్ణ మూడు డిపార్ట్‌‌మెంట్లలో పనిచేసిన సమయాల్లో రియల్‌‌ ఎస్టేట్‌‌ సంస్థలతో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ఆయనకు జనగాం జిల్లాలో అత్యధికంగా 102 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్‌‌‌‌ కర్నూల్‌‌ జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో 12 ప్లాట్స్, విజయనగరం, విశాఖపట్నంలో ప్లాట్స్‌‌ గుర్తించారు. మొత్తం రూ.13.3 కోట్లకు పైగా విలువ చేసే 29 ప్లాట్స్‌‌కు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్స్‌‌లో18 తులాల బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్లు సేకరించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.250 కోట్లు అంతకంటే రెట్టింపు ఉండే అవకాశం ఉందని చెప్పారు. బినామీ నవీన్‌‌కుమార్‌‌‌‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని వెల్లడించారు.