
హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేష్ శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. శనివారం (సెప్టెంబర్ 06) ఉదయం లడ్డూ ప్రసాదం వేలంపాట ముగిసిన తర్వాత.. ప్రారంభమైన శోభాయాత్ర.. భక్తుల కోలాహలం నడుమ ఎంతో వేడుకగా ముందుకు సాగుతోంది.
బాలాపూర్ నుంచి బార్కస్ రోడ్డుకు చేరుకున్న గణనాథుడి యాత్ర.. భక్తుల ఆటలు, పాటలు, డ్యాన్సుల నడుమ సాగింది. ప్రత్యేక బ్యాండు మేళానికి భక్తులు శోభాయాత్రలో చిందేశారు. బాలాపూర్ నుంచి కాస్త నెమ్మదిగా కదిలిన యాత్ర.. అక్కణ్నుంచి చంద్రాయణగుట్ట కేశవగిరి, మహబూబ్ నగర్ చౌరస్తా మీదుగా సాగింది.
శోభాయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ డీఎస్పీ స్నేహ శోభాయాత్ర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ యాత్రను ముందుకు తీసుకెళ్తున్నారు.
ALSO READ : బైబై గణేశా.. గంగమ్మ ఒడికి మహాగణపతి..
చంద్రాయణ గుట్ట నుంచి ఫలక్ నుమా, ఇంజన్ బౌలి, అలియాబాద్ ప్రాంతానికి కాస్త వేగంగానే యాత్ర ముందుకు సాగింది. అక్కడి నుంచి లాల్ దర్వాజా మీదుగా శోభాయాత్ర ముందుకు సాగింది. గణేష్ మరాజ్ కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు యాత్రలో చిందేస్తున్నారు.
లాల్ దర్వాజా దాటి శాలిబండ పిస్తా హౌస్ చేరుకుంది శోభాయాత్ర. అక్కడి నుంచి ప్రస్తుతం చార్మినార్ కు చేరుకుంది యాత్ర.
అనంతరం అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంటుంది.