బల్దియా కార్మికుల సమ్మె.. కాలనీలు, బస్తీల్లో ఎక్కడ చూసినా చెత్త కంపు

బల్దియా కార్మికుల సమ్మె.. కాలనీలు, బస్తీల్లో ఎక్కడ చూసినా చెత్త కంపు
  • 13 వేల మందికి పైగా విధుల బహిష్కరణ
  • వివిధ విభాగాల్లో నిలిచిపోయిన పనులు
  • కాలనీలు,బస్తీల్లో ఎక్కడ చూసినా చెత్త కంపు 
  • దోమల నివారణపైనా ఎలాంటి చర్యల్లేవ్ 
  • బంద్ అయిన యాంటీ లార్వా ఆపరేషన్లు
  •  కార్మికులు వస్తేనే పనులు అంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు : బల్దియా కార్మికుల సమ్మెతో సిటీలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమను పర్మినెంట్ చేయాలని కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. జీహెచ్ఎంసీలో శానిటే షన్, ఎంటమాలజీ, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు, హార్టికల్చర్, వెటర్నరీ, వర్క్ ఇన్ స్పెక్టర్లు, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్స్, ట్రాన్స్ పోర్టు సెక్షన్‌‌ తదితర విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన 27,500 మంది పని చేస్తున్నారు.  గ్రేటర్ హైదరాబాద్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మెలో దాదాపు13వేల మంది కార్మికులు పాల్గొంటున్నారు. 

ఇందులో అన్ని విభాగాల వారు ఉండడంతో  అన్ని పనులపైనా సమ్మె ప్రభావం పడింది. ప్రధానంగా శానిటేషన్ కార్మికులు లేక కొన్నిప్రాంతాల్లో రోడ్లు ఊడ్చే వాళ్లు లేరు. దీంతో రోడ్ల పక్కన చెత్త కుప్పలు పేరుకుపోయాయి. వీఐపీలు ఉండే ప్రాంతాల్లో మెషీన్లను పెట్టి క్లీన్ చేయిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో మాత్రం సమస్య తీవ్రమైతుంది. భారీ వర్షాల తర్వాత గ్రేటర్ లో దోమల బెడద పెరిగింది. ఎంటమాలజీ విభాగంలోని 2 వేల మంది కార్మికుల్లో  దాదాపు 1500 మంది సమ్మెలో ఉన్నారు. 
దీంతో దోమల నివారణకు తీసుకోవాల్సిన ఎలాంటి చర్యలు లేవు. యాంటీ లార్వా ఆపరేషన్లు నిలిచిపోగా దోమల విజృంభణ మరింత తీవ్రమవుతుంది. ఇప్పటికే డెంగీ కేసులు పెరుగుతున్నాయి.  ఈ సమ్మె కారణంగా మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇలా కార్మికుల సమ్మెతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 

ఆస్పత్రులకు రోగుల తాకిడి 

సిటీలో సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులకు రోగుల తాగిడి పెరుగుతుంది. మరోవైపు కార్మికుల సమ్మెతో  సిటీ క్లీన్ గా లేకపోతుండగా జనాలు  మరింత రోగాల బారిన పడే ప్రమాదముంది. ప్రతిఏటా ఆగస్టు, సెప్టెంబర్ లో డెంగీ కేసులు వేలల్లో నమోదవుతాయి. రెండేళ్లుగా చూస్తే ఈ సీజన్ లోనే అత్యధికంగా వస్తున్నాయి.  గ్రేటర్ లో ఈనెలలో ఇప్పటివరకు 500కుపైగా కేసులు నమోదైనా దోమల నివారణపై చర్యలు తీసుకునేవారు లేరు. కొన్నిచోట్ల సమ్మెలో పాల్గొనని కార్మికులు ఫాగింగ్  చేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోతుండగా సమస్య తీవ్రమయ్యే ప్రమాదముంది. కార్మికులు సమ్మె విరమిస్తే గానీ ఏం చేయలేమని అధికారులు అంటున్నారు. 

పెరుగుతున్న మద్దతు 

కార్మికుల సమ్మెకు మద్దతు పెరుగుతుంది. ముందుగా శానిటేషన్, ఎంటమాలజీ  విభాగాలతో పాటు ఇంకొందరు కార్మికులు సమ్మెకు దిగారు.  ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు, హార్టికల్చర్, వెటర్నరీ, వర్క్ ఇన్ స్పెక్టర్లు, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్స్, ట్రాన్స్ పోర్టు సెక్షన్‌‌ తదితర విభాగాల సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు.  ఇందిరాపార్కు వద్ద పార్కుల్లో పనిచేసే జీహెచ్ఎంసీ  హార్టికల్చర్, సెక్యూరిటీ గార్డ్స్ విధులు బహిష్కరించి సమ్మెకు జై కొట్టారు.  సమ్మెలో పాల్గొనే కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. సర్కారు వెంటనే నిర్ణయం తీసుకోకపోతే కార్మికులంతా రోడ్డు ఎక్కే అవకాశముంది.

అప్పట్లో హామీ ఇచ్చినందునే.. 

రాష్ట్రం వచ్చాక కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​అనే మాట వినిపించదని అప్పట్లో కేసీఆర్​హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కార్మికుల బతుకులు ఆగమైతున్నాయని, తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్​ప్రభుత్వం వస్తే పర్మినెంట్​చేస్తానని చెప్పి భరోసా ఇచ్చారు. జీహెచ్​ఎంసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో  ఎంప్లాయీస్​యూనియన్ విజయం సాధించిన సందర్భంగా 2012 సెప్టెంబర్ 9న బల్దియా హెడ్డాఫీసులో సమావేశం జరిగింది. ఆ సభకు హాజరైన కేసీఆర్​టీఆర్ఎస్​అధికారంలోకి వస్తే కార్మికులను పర్మినెంట్​చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. ప్రత్యేక జీవో ద్వారా పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి పదేళ్లు అయినా హామీలు మాత్రం నెరవేరడంలేదు.  దీంతో చేసేదేమీ లేక జీహెచ్​ఎంసీ ఔట్​సోర్సింగ్​ కార్మికులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వం స్పందించకపోతే వేరే మార్గం లేక విధులు బహిష్కరించి సమ్మె బాటపట్టారు. రోడ్లు ఊడ్చే కార్మికులమని చిన్న చూపుచూడకుండా ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించాలని కార్మికులు కోరుతున్నారు. 

కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..

ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా కేసీఆర్ ​ఇచ్చిన హామీలను సీఎం అయ్యాక నెరవేర్చడంలేదు. సబ్బండ వర్గాలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇంత అన్యాయం చేయడం తగదు. కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే సీఎం కేసీఆర్ అమలు చేయాలె. పర్మినెంట్ చేసేంత వరకు సమ్మె ఆగదు.

– ఊదరి గోపాల్, జీహెచ్ఎంఈయూ ప్రెసిడెంట్​