నేపాల్ ఎన్నికల్లో బాలేంద్ర షా ఘన విజయం

నేపాల్ ఎన్నికల్లో బాలేంద్ర షా ఘన విజయం
  • 165 స్థానాలకు గాను 117 సీట్లు కైవసం
  • మరో 8 స్థానాల్లో ముందంజ
  • మాజీ ప్రధాని ఓలీ, ప్రముఖులకు తప్పని ఓటమి

ఢిల్లీ: నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో ర్యాపర్, కాఠ్మండు మాజీ మేయర్​బాలేంద్ర షా(బాలెన్) నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్ఎస్పీ) ఘనవిజయం సాధించింది. ఏండ్లకాలంగా రాజకీయాలను శాసిస్తున్న పార్టీలను వెనక్కినెట్టి ప్రభంజనం సృష్టించింది. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 165 స్థానాలకు గాను ఇప్పటికే 117 స్థానాల్లో విజయం సాధించగా, మరో ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉందని ఎన్నికల సంఘం తెలిపింది.

కాఠ్మాండు వ్యాలీలోని మూడు జిల్లాల్లో ఉన్న మొత్తం 15 నియోజకవర్గాలను ఆర్ఎస్పీ క్లీన్ స్వీప్ చేసింది. వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి, బంధుప్రీతిపై విసిగిపోయిన నేపాల్ యువత మార్పును కోరుకుంటూ ఆర్ఎస్పీకి పట్టం కట్టింది. గతేడాది సెప్టెంబర్‌‌‌‌లో జరిగిన భారీ నిరసనల తర్వాత ఓలీ ప్రభుత్వం కూలిపోవడం, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో బాలెన్ నేతృత్వంలోని పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం విశేషం.

బాలెన్​షా చేతిలో మాజీ ప్రదాని ఓలీ ఓటమి

35 ఏండ్ల బాలేంద్ర షా జపా-5 నియోజకవర్గంలో మాజీ ప్రధాని, సీపీఎన్​-యూఎంఎల్ అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీని సుమారు 50 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. బాలెన్ 68,348 ఓట్లు సాధించగా, ఓలీకి కేవలం 18,734 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓలీ పార్టీ సీపీఎన్​-యూఎంఎల్ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. నేపాలీ కాంగ్రెస్(ఎన్​సీ) కేవలం 17 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.

నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షపదవికి రేసులో ఉన్నగగన్ థాపా, ఆర్​ఎస్పీ అభ్యర్థి అమరేశ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. సీపీఎన్​-యూఎంఎల్ కు చెందిన ప్రధాన కార్యదర్శి శంకర్ పోఖ్రేల్ సహా పది మంది కీలక నేతలు ఓటమి పాలయ్యారు. ఘన విజయంతో నేపాల్ తదుపరి ప్రధానిగా బాలెన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

దీంతో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు.ప్రధాని మోదీ అభినందనలు..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నేపాల్ ప్రజలు, ఆర్​ఎస్పీ పార్టీకి అభినందనలు తెలిపారు. సన్నిహిత మిత్రదేశం నేపాల్‌‌‌‌తో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు