మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​కు నోటీసులు

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​కు నోటీసులు
  • సీఎం రేవంత్​ను చెప్పుతో కొడతా’ అంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు 

మంచిర్యాల, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఆదివారం హైదరాబాద్ శివారు చల్లాపూర్ లోని బీఆర్ఎస్ ఆఫీసులో మంచిర్యాల పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. ఈ నెల 5న మంచిర్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషించారు.

కేసీఆర్​ను తిడితే చెప్పుతో కొడతానంటూ.. తన కాలుకున్న చెప్పు తీసి చూపించారు. దీంతో అదే రోజు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కాంగ్రెస్​నాయకులు బాల్క సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంచిర్యాల పీఎస్​లో ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిన్నటి దాకా పోలీసులు బాల్క సుమన్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని, ఆయన పరారీలో ఉన్నట్టు ప్రచారం జరిగినప్పటికీ, హైదరాబాద్ లోనే ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి నోటీసులు అందజేశారు.

కాగా కాంగ్రెస్​ప్రభుత్వం తనపై నమోదు చేసిన అక్రమ కేసును చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని బాల్క సుమన్ తెలిపారు. ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వం తనపై 200 కేసులు పెట్టిందన్నారు. కేసులు తనకు కొత్త కాదని, పలుమార్లు చంచల్​గూడ జైలుకు కూడా వెళ్లానని చెప్పారు.