బాల్క సుమన్ ల్యాండ్, సాండ్, లిక్కర్ మాఫియా : అక్రమ దందాలతో వేల కోట్లు

బాల్క సుమన్ ల్యాండ్, సాండ్, లిక్కర్ మాఫియా : అక్రమ దందాలతో వేల కోట్లు

వెలుగు, చెన్నూర్​:  చెన్నూర్​ నియోజకవర్గంలో ల్యాండ్​... సాండ్​... లిక్కర్​ మాఫియా ఎమ్మెల్యే బాల్క సుమన్​ కనుసన్నల్లో నడుస్తోంది. ఇసుక అక్రమ రవాణా ద్వారా సుమన్​ రూ.వేల కోట్లకు పడగలెత్తగా, ఆయన అనుచరులు ల్యాండ్​, లిక్కర్​ దందాలు చేస్తూ రూ. వందల కోట్లు సంపాదించారు. చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని గోదావరిలో 12 ఇసుక రీచ్ లు ఉన్నాయి. టీఎస్ ఎండీసీ, మైనింగ్​ డిపార్ట్​మెంట్ల ఆధ్వర్యంలో ఆన్ లైన్  ద్వారా ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. గతంలో ఒక్కో రీచ్  నుంచి రోజుకు 150 నుంచి 200 లారీలు నడవగా, ప్రస్తుతం 100 లారీలు నడుస్తున్నాయి. టీఎస్ ఎండీసీ ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్  చేసుకున్న లారీలకు మాత్రమే ఇసుక రవాణాకు పర్మిషన్​ ఉంటుంది. 

కానీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అండతో రోజుకు దాదాపు వంద లారీలు హైదరాబాద్​కు జీరో  కొడుతున్నారు. ఒక్కో లోడ్​కు రూ.50 వేల చొప్పున రోజుకు రూ.లక్షల్లో వెనకేసుకుంటున్నారు. ఆన్​లైన్​లో బుకింగ్​ చేసుకున్న లారీల్లో సైతం ఐదు టన్నుల వరకు ఓవర్ లోడ్  కొడుతున్నారు. ఒక్కో టన్నుకు రూ.5వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇసుక మాఫియాకు బాల్క సుమన్​ సపోర్టు ఉండడంతో ఆఫీసర్లు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఆఫీసర్లు వినకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలాగే మల్లన్నసాగర్  ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం కేటాయించిన  జైపూర్  మండలం వేలాల గోదావరి రీచ్​ నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్​కు అక్రమ రవాణా చేశారు. ఇసుక లారీలు ఓవర్​ లోడ్​తో నడవడం వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయి. నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 

గవర్నమెంట్​, అసైన్డ్​ భూములు కబ్జా..


చెన్నూర్​ నియోజకవర్గంలో రూలింగ్​ పార్టీ లీడర్లు వందల ఎకరాల్లో గవర్నమెంట్​, అసైన్డ్​ భూములను కబ్జా పెట్టారు. మందమర్రి మున్సిపాలిటీ ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉండడంతో ఇక్కడ భూముల క్రయవిక్రయాలపై నిషేధం ఉంది. కానీ అధికార పార్టీ నాయకులు రూల్స్​ను ఉల్లంఘించి, అసైన్డ్​దారులను బెదిరించి వందల ఎకరాలను భూములను కబ్జా చేసి రియల్​ బిజినెస్​ చేస్తున్నారు. చెన్నూర్​ మున్సిపాలిటీ పరిధిలోని  గవర్నమెంట్​, అసైన్డ్​ భూములను సైతం కబ్జా చేశారు. మున్సిపాలిటీ నుంచి అక్రమంగా హౌస్​ నంబర్లు పొంది అమ్మకాలు జరుపుతున్నారు. చెన్నూర్​ మండలంలో సెరీకల్చర్  డిపార్ట్​మెంట్​కు సంబంధించిన 100 ఎకరాలకు పైగా ​ భూములను గులాబీ పార్టీకి  చెందిన ప్రజాప్రతినిధులు, చోటామోటా లీడర్లు కబ్జా చేశారు. పట్టపగలే  ఏరుమద్ది చెట్లను కొట్టేసి బ్లేడ్​ ట్రాక్టర్లతో సాఫ్​ చేసి పంటలు వేస్తున్నారు. మరికొందరు మామిడితోటలు పెడుతున్నారు. ఇక్కడ ఎకరానికి రూ.30 లక్షల పైనే పలుకుతోంది. ఈ లెక్కన అన్యాక్రాంతమైన భూముల విలువ రూ.30 కోట్ల పైమాటే. 

చెన్నూర్​ మున్సిపల్​ చైర్​పర్సన్​ భర్త భూకబ్జా..

చెన్నూర్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​కు రైట్​ హ్యాండ్​గా ఉన్న మున్సిపల్​ చైర్​పర్సన్​ భర్త రాంలాల్​ గిల్డా ఏకంగా తెలంగాణ క్రీడా ప్రాంగణం భూమికే ఎసరు పెట్టాడు. మండలంలోని బావురావుపేట శివారు సర్వేనంబర్​ 3లో  4 గుంటల స్థలాన్ని కబ్జా పెట్టి పోల్స్​ వేశాడు. ఎన్​హెచ్​ 63ని ఆనుకుని ఉండడంతో ఇక్కడ గుంటకు రూ.10 లక్షల పైనే రేటు పలుకుతోంది. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

లిక్కర్​ ‘వాలా’కు సుమన్​ అండ.... 

ఎమ్మెల్యే బాల్క సుమన్​ ముఖ్య అనుచరుడు, కోటపల్లి మండల వైస్​ ఎంపీపీ వాలా శ్రీనివాస్​ రావు లిక్కర్​ దందాతో కోట్లు కూడబెట్టాడు. చెన్నూర్, కోటపల్లి మండలాల్లో వైన్​ షాపులు కలిగిన ఆయన అక్రమంగా మహారాష్ర్టకు భారీ ఎత్తున లిక్కర్​ సప్లై చేస్తున్నాడు. సరిహద్దుల్లోని ప్రాణహిత నది వరకు ఎడ్లబండ్లు, ఆటోల్లో  లిక్కర్ తీసుకెళ్లి అక్కడి నుంచి నాటు పడవల ద్వారా నది అవతలికి దాటిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి ఆదివాసీ జిల్లా కావడంతో అక్కడ మద్య నిషేధం అమలులో ఉంది. దీంతో చెన్నూర్​ నియోజకవర్గం నుంచి సిరొంచ తాలూకాలోని గ్రామాలకు సప్లై చేస్తున్నారు. 

బాల్క సుమన్​ సపోర్ట్​తోనే కబ్జాలు...

చెన్నూర్​ పట్టణంతో పాటు మండలంలోని రూ.కోట్ల విలువైన గవర్నమెంట్​, అసైన్డ్​ భూములను బీఆర్​ఎస్​ లీడర్లు కబ్జాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్​ సపోర్ట్​తోనే ఆయన అనుచరులు బరి తెగించిపోతున్నారు. రెవెన్యూ అధికారులు కళ్లు తెరిచి అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలి. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 
- సుద్దపల్లి సుశీల్​ కుమార్​

బాల్క సుమన్​ అవినీతిని కక్కిద్దాం..

‘రాష్ట్రంలో  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ అవినీతిని రాహుల్ గాంధీ  కక్కిస్తా అన్నడు.. సుమన్ అవినీతిని మనం కక్కిద్దాం.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించుకుంటే... కేసీఆర్​ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిండు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని పేదలను మోసం చేసిండు. ఆయన ఇంట్లో  మాత్రం ఆరు ఉద్యోగాలు ఇచ్చుకున్నడు. నెలకు రూ.50 లక్షల జీతం తీసుకుంటున్నరు. కేసీఆర్ సొంతూరులో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చిండు. కేసీఆర్ చిన్నకొడుకు ఇలాక చెన్నూరులో ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్​ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. రోడ్లు, ఇతర మౌలిక సౌలతులకు పైసలు  పెట్టకుండా కమీషన్ వస్తదని కాళేశ్వరానికి ఫండ్స్​ మళ్లించిండు. కాంట్రాక్టులన్నీ ఆంధ్రోళ్లకు కట్టబెట్టిండు.  5 లక్షల కోట్ల అప్పు చేసి పుట్టిన బిడ్డ మీద కూడా రుణ భారం మోపిండు.    ‘బాల్క సుమన్  ఇంట్లో గోడకు తుపాకీ ఉంటది.. అది అవసరం ఉన్నపుడు తీస్తా అని అంటున్నడు. పాపం మనం సుమన్​కు తుపాకీ కాల్చే అవకాశం ఇవ్వాలే. ఈ నెల 30న జరిగే ఎన్నికలో  కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్​ను గెలిపించాలే. ఆ తర్వాత మెట్​పల్లిలో గల్లీల్లో తుపాకీ పట్టుకొని పిట్టలను కాల్చుకుంటూ తిరిగే అవకాశం కల్పించాలే’

ALSO READ :- బీఆర్ఎస్ పాలనలో చెరువుల్లో జలకళ : సంజయ్ కుమార్