BAN vs SL: ఊపిరి పీల్చుకున్న బంగ్లా పులులు.. శ్రీలంకపై ఘన విజయం

BAN vs SL: ఊపిరి పీల్చుకున్న బంగ్లా పులులు.. శ్రీలంకపై ఘన విజయం

బంగ్లాదేశ్‌ జట్టు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంకేయులు నిర్ధేశించిన 280 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి మరో 53 బంతులు మిగిలివుండగానే చేధించింది. ఫలితంగా వరుస ఓటములకు చెక్ పెట్టి.. మెగా టోర్నీలో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

279 పరుగుల ఛేదనలో బంగ్లా ఓపెనర్లు తాంజిద్ హసన్(9), లిట్టన్ దాస్(23) త్వరగానే ఔటైనా.. నజముల్ హుస్సేన్ శాంటో(90)- షకీబ్(82) జోడి మూడో వికెట్‌కు ఏకంగా 169 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో వీరిద్దరూ వెనుదిరిగిన మహ్మదుల్లా(22), ముష్ఫికర్ రహీం(10), తౌహిద్ హృదయ్( 15 నాటౌట్) తలో చేయేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.

అంతకుముందు చరిత అసలంక(108; 105 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ 3 వికెట్లు పడగొట్టగా.. షోరిఫుల్ ఇస్లాం, షకీబ్ అల్ హసన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ కు ఇది రెండో విజయం కాగా, లంకేయులకు ఆరో ఓటమి.