
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీ నేత బండారు దత్తాత్రేయ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఈ శుక్రవారం ఆయన యాదాద్రి నరసింహుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ.. హిమచల్ ప్రదేశ్ గవర్నర్ గా తనను నియమించడమనేది తన పుణ్యఫలంగా భావిస్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనను గవర్నర్ గా నియమించడమనేది తెలంగాణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు దత్తాత్రేయ. యాదాద్రి ఆలయం దేశంలో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లాలని ప్రార్థిస్తున్నాని ఆయన అన్నారు. “ హిమాచల్ ప్రదేశ్ అనేది ఎన్నో శక్తిపీఠాలున్న గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. ఆ రాష్ట్రం గొప్ప దేవభూమి, వీరభూమి. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లోని ఆధ్యాత్మిక కేంద్రాలను లింక్ చేసి టూరిజం అభివృద్దికి తోడ్పడతా. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రెండూ రష్ట్రాలు గొప్ప పోరాటాల గడ్డ. సమాజంలో నైతికత పెరగాలి. ప్రజలు ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలి” అని దత్తాత్రేయ అన్నారు.