నర్సంపేట: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి సంతాపంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో బంద్ కొనసాగుతుంది. వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
అర్ధ రాత్రి 12 గంటల 51 నిమిషాలకు మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. అభిమానులు, కార్యకర్తలు, బంధువులు, శ్రేయోభిలాషులలో ఈ పరిణామం తీవ్ర విషాదం నింపింది. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.
పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్తతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, బంధువులు, శ్రేయోభిలాషులు శోక సంద్రంలో మునిగిపోయారు. యశోద ఆసుపత్రి దగ్గరకు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం దాదాపు 6 గంటల సమయంలో ఆయన మృతదేహాన్ని నర్సంపేట నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం నల్లబెల్లికి తరలించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
