బండి సంజయ్ అరెస్టు.. పోలీసుల దాడి దుర్మార్గం

బండి సంజయ్ అరెస్టు.. పోలీసుల దాడి దుర్మార్గం

తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా దీక్ష చేయాలని ప్రయత్నిస్తే.. అరెస్టు చేయడం ఎంతవరకు సబబమని ప్రశ్నించారు. అరెస్టు చేసే క్రమంలో.. తాము అడ్డుకొంటే పోలీసులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారని కార్యకర్తలు ఆరోపించారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే..ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించామని తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభ ఫెయిల్ అయ్యిందిని.. బీజేపీ నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ కావడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని, ప్రగతిభవన్ ప్లాన్ లో  భాగంగానే బండి సంజయ్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బండి సంజయ్ ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పడం లేదన్నారు. టీఆర్ఎస్ ను ప్రజలు చీదరించుకుంటున్నారని మండిపడ్డారు. 

బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర 20వ రోజు కొనసాగుతోంది. 19వ రోజు సోమవారం రాత్రి పొన్నూరు దగ్గర బస చేశారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, బీజేవైఎం నేతల అరెస్టుపై దీక్ష చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. మంగళవారం దీక్షకు సిద్ధమౌతున్న క్రమంలో.. పోలీసులు ఒక్కసారిగా దూసుకొచ్చి.. ఆయన్ను అరెస్టు చేశారు. దీనిపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేయాలని ప్రయత్నించిన టీఆర్ఎస్ నేతలను నిలువరించాల్సింది పోయి.. ఇలా చేయడం సబబు కాదన్నారు. అనేక ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగిస్తున్నారని, కానీ.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రజాస్వామ్యం అస్సలు లేదని. తాము జాతీయ పార్టీ దృష్టికి తీసుకెళుతామన్నారు. టీఆర్ఎస్ బండారాన్ని ప్రజల్లో ఎండగడుతామన్నారు .