
- ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చేస్తా.. జరగలేదని చేసే దమ్ము నీకుందా
- ఉంటే ఏ గుడికి రావాలో.. టైం, డేట్ చెప్పు
- ఫోన్ ట్యాపింగ్‌తో వ్యాపారులను బెదిరించి పైసలు వసూలు చేశారని ఆరోపణ
- ఈడీ విచారణ చేస్తేనే ఆ లావాదేవీలు బయటకొస్తాయని వ్యాఖ్య
కరీంనగర్, వెలుగు:బీఆర్‌ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ‘‘కేటీఆర్.. నేను నా కుటుంబసభ్యులతో కలిసి గుడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తడిబట్టలతో ప్రమాణం చేస్తాను. నువ్వు కూడా నీ భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో కలిసి గుడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రమాణం చేస్తావా? ఏ ఆలయానికి రావాలో.. ఎప్పుడు రావాలో నువ్వే చెప్పు. నీకు ఆలయంపై నమ్మకం లేదంటే.. మసీదు, చర్చికైనా వెళ్దాం.. ప్రమాణానికి సిద్ధమా?” అని సవాల్ విసిరారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం కరీంనగర్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, జర్నలిస్టులతో కలిసి సంజయ్ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో మావోయిస్టుల పేరు చెప్పి.. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, వ్యాపారులు, రియల్టర్ల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌తో బ్లాక్‌మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని చెప్పారు.
ఈడీ విచారణ చేస్తేనే ఆ లావాదేవీల సంగతి బయటకొస్తుందన్నారు. ‘‘మా ఫోన్ నెంబర్లను మావోయిస్టు సానుభూతిపరుల నెంబర్లుగా కేంద్రానికి పంపి ఎస్ఐబీ అప్రూవల్ తీసుకున్నది. ఇదంతా రహస్యం కాబట్టే వాటిని క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కేంద్రానికి ఉండదు. కేంద్ర హోంశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావును నియమించారు. చిన్నపిల్లలు పాటలు పెట్టుకుని విన్నట్టు.. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు పొద్దంతా మా మాటలు విన్నారు.
పెద్దాయన(కేసీఆర్) చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రధాన నిందితుడు రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడించారు. నాటి డీజీపీ చెబితేనే ట్యాపింగ్ చేసినట్టు ప్రభాకర్ రావు చెప్పారు. అయినా ఇంతవరకు వాళ్లకు నోటీసులిచ్చి పిలిచే సాహసం కూడా సిట్ చేయలేకపోతున్నది” అని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర సంస్థలు నేరుగా విచారణ జరిపే అవకాశం లేదని.. అందుకే ఈ కేసును సీబీఐ, ఈడీకి అప్పగించాలని రాష్ట్ర సర్కార్‌ను కోరుతున్నామన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను వంచిస్తున్నయ్..
రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని సంజయ్ అన్నారు. ‘మీ పదేండ్ల అవినీతికి మేం రక్ష.. మా దోపిడీకి మీరు రక్ష’ అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరించుకుంటూ ప్రజలను వంచిస్తున్నాయని మండిపడ్డారు. బెంగాల్ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీకి కేసీఆర్ డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గుంటే ఆ పార్టీని వదిలి బయటకు రావాలని అన్నారు.
కేటీఆర్.. మీ చెల్లెకు నోటీసులిస్తవా?
లీగల్ నోటీసులు ఇస్తానన్న కేటీఆర్ హెచ్చరికలపై సంజయ్ స్పందించారు. ఆయన ఇచ్చే లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ‘‘కేటీఆర్.. నేను ఏం తప్పు చెప్పిన? సాక్షాత్తు మీ చెల్లెలు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పింది కదా! మరి ఆమెకు లీగల్ నోటీసులు ఇస్తవా? పెద్దాయన(కేసీఆర్) చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో చెప్పారు కదా. ఆ విషయం కోర్టు ముందుంది. ఆయనకూ నోటీసులిస్తావా?” అని ప్రశ్నించారు.
‘‘అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే కేసీఆర్, ఆయన కొడుకు ఎప్పటికీ జైల్లోనే ఉంటారు. వాళ్లు తిట్టని తిట్లు లేవు. మాట్లాడని బూతుల్లేవు. చేయని తప్పులు లేవు. జరపని అవినీతి లేదు.. నోటీసులిస్తే.. ఏం చేయాలో నాకు తెలుసు. అంతకంటే ఎక్కువ నోటీసులు నా దగ్గరున్నాయి. ఒక రాజకీయ నాయకుడివై ఉండి నేరుగా ఎదుర్కొనే దమ్ములేక చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీసులతో బెదిరించాలనుకోవడం మూర్ఖత్వం” అని కేటీఆర్‌పై మండిపడ్డారు.