ఏపీకి నీళ్లు దోచిపెట్టి నీతులు చెప్తున్నరు : బండి సంజయ్

ఏపీకి నీళ్లు దోచిపెట్టి నీతులు చెప్తున్నరు : బండి సంజయ్
  • అపర మేధావుల్లా మాట్లాడుతున్నరు
  • జూన్ 4న బీఆర్ఎస్ దుకాణం బంద్ అయితదని కామెంట్

కరీంనగర్, వెలుగు: కమీషన్లకు కక్కుర్తి పడి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను బీఆర్ఎస్ లీడర్లు అక్రమంగా ఏపీకి దోచిపెట్టారని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు మళ్లీ వాళ్లే నీటి పంపిణీపై మాట్లాడటం.. దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని ఒక ప్రకటనలో మండిపడ్డారు. జనం నవ్వుకుంటారనే సోయి కూడా లేకుండా అపర మేధావిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

గోదావరి, కృష్ణా జలాలు, ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ లీడర్లకు లేదు. మనకు రావాల్సిన నీళ్లను ఏపీకి దోచిపెట్టారు. కమీషన్లకు కక్కుర్తిపడి కట్టిన ప్రాజెక్టులు అన్నీ కూలిపోతున్నయ్. మొన్న కాళేశ్వరం.. ఇయ్యాల పెద్దపల్లి ఓడేడు బ్రిడ్జే ఇందుకు నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు, మోసాల పట్ల ప్రజలు విసిగిపోయారు. 

ఆ పార్టీ నేతలు మొసలి కన్నీరు కార్చినా.. పొర్లు దండాలు పెట్టినా.. బస్ యాత్ర కాదు కదా.. మోకాళ్ల యాత్ర చేసినా.. జనం నమ్మే పరిస్థితి లేదు”అని విమర్శించారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా బీఆర్ఎస్​ను నమ్మడం లేదని, అందుకే ఈనెల 27న బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించడం లేదని పేర్కొన్నారు. జూన్ 4న బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం పక్కా అని తెలిపారు.