
హైదరాబాద్/చొప్పదండి, వెలుగు: బీజేపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులన్నీ సీఎం కేసీఆర్ డైరెక్షన్లో, పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నాయని బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి బీజేపీ నేతలను జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి టౌన్లో రూ.10 లక్షల ఎంపీ లాడ్స్‌తో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సంజయ్ శనివారం ప్రారంభించారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభతో కలిసి మీడియాతో మాట్లాడారు. సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం కేసీఆర్ చేసిన కుట్రలో భాగంగానే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. గతంలో నల్గొండలో, కరీంనగర్లో తనపై, ఆర్మూర్‌లో ఎంపీ అర్వింద్‌పై దాడులు, కార్యకర్తలపై హత్యాయత్నం కుట్రలో భాగమేనన్నారు. శుక్రవారం ఖమ్మంలో నాగేశ్వర్ రావు అనే బీజేపీ కార్యకర్తను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారని, లోకల్ సీఐ బూతులు తిడుతూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కొందరు పోలీసులు సీఎంకు కొమ్ముకాస్తున్నరని, ఇది మంచిది కాదన్నారు. కేంద్రం యాసంగిలోనూ రా రైస్ ఎంతైనా కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. రైతుల నుంచి ధాన్యం ఎందుకు కొనడం లేదో చెప్పాలన్నారు. ఈ యాసంగిలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. కేంద్రంపై నెపాన్ని నెట్టాలని చూస్తే ఈసారి రైతులే తిరగబడతారని హెచ్చరించారు.
ధరణిపై రౌండ్ టేబుల్ మీటింగ్
బండి సంజయ్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ధరణిపై బీజేపీ స్టేట్ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ధరణి కారణంగా రెవెన్యూ శాఖలో ఏర్పడుతున్న ఇబ్బందులు, లోపాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. ఈ మీటింగ్‌లోని చర్చించిన అంశాలను రాష్ట్ర సర్కారుకు రిపోర్టు అందజేస్తారు. కాగా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ సర్కారు ఖూనీ చేస్తుందని ఆరోపిస్తూ వచ్చే నెల 4న చలో డీజీపీ ఆఫీసుకు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ స్టేట్ ఆఫీసు నుంచి డీజీపీ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి మెమోరాండం ఇవ్వనున్నారు.
ఇయ్యాల్టి నుంచి బీజేపీ ‘మైక్రో డొనేషన్స్’ ప్రోగ్రామ్
చిన్న మొత్తాలను విరాళంగా సేకరించే ‘మైక్రో డొనేషన్స్’ ప్రోగ్రామ్‌ను బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆదివారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆదివారం నుంచి ఫిబ్రవరి 11 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ‘మైక్రోడొనేషన్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తారు. పార్టీ దీని బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డికి అప్పగించింది. రూ.5 నుంచి రూ.1,000 వరకు మాత్రమే విరాళంగా తీసుకుంటారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, నెట్ బ్యాంకింగ్ తదితర ఆన్‌లైన్ సర్వీసులతో మాత్రమే డొనేషన్స్ ఇవ్వాలని, ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే ఇవ్వాలని కోరింది. క్యాష్, చెక్‌లను తీసుకోబోమని స్పష్టం చేసింది.