కేసీఆర్ అలసత్వం వల్లే స్టూడెంట్ల ఆత్మహత్యలు

కేసీఆర్ అలసత్వం వల్లే స్టూడెంట్ల ఆత్మహత్యలు

కేసీఆర్​ అలసత్వం వల్లేసీఎం కేసీఆర్​ నీరో చక్రవర్తిలా తయారయ్యారని, ఆయన అలసత్వం వల్లే తెలంగాణలో 27 మంది ఇంటర్​ స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారని కరీంనగర్‌‌ ఎంపీ బండి సంజయ్‌‌ ఆరోపించారు. విద్యను కేవలం వ్యాపార దృక్పథంతో కేసీఆర్​ చూస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్​కు పెద్దింటోళ్లు చనిపోతే పరామర్శించేందుకు సమయం ఉంటుందని, కానీ ఇంటర్ స్టూడెంట్ల తల్లిదండ్రులను పరామర్శించేందుకు మాత్రం సమయం ఉండదా? అని నిలదీశారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌‌ చేశారు. బుధవారం లోక్​సభలో జీరో అవర్‌‌లో భాగంగా ఆయన తెలంగాణ ఇంటర్‌‌ స్టూడెంట్స్​ ఆత్మహత్యల అంశాన్ని ప్రస్తావించారు. టీఆర్ఎస్​ సర్కారు, సీఎం కేసీఆర్​ తీరుపై విమర్శలు గుప్పించారు. బండి సంజయ్​కు లోక్​సభలో సంజయ్​కు ఇదే తొలి స్పీచ్​ కావడం, అందులోనూ ఆయన తెలుగులో మాట్లాడటం విశేషం.

విద్యను వ్యాపారంగా చూస్తున్నారు..

విద్యను కేవలం వ్యాపార దృక్పథంతో చూస్తున్నారని సీఎం కేసీఆర్​ను బండి సంజయ్​ విమర్శించారు. ‘‘దేశంలో కానీ, ప్రపంచంలోగానీ ఎక్కడైనా బాధలతో, కష్టాలతో ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో తొమ్మిది లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాస్తే. మూడున్నర లక్షల మంది ఫెయిలవడం ఏమిటి? ఇంత మంది విద్యార్థులు ఫెయిలవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఏ మాత్రం అనుభవం లేని గ్లోబరీనా వంటి సంస్థకు ఫలితాల ప్రాసెసింగ్, విడుదల బాధ్యతను అప్పగించడమే దీనికి కారణం. అవకతవకలకు కారణమైన వారిని శిక్షించాలని బీజేపీ ఆందోళనలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకో లేదు. పైగా రీవెరిఫికేషన్​ పేరుతో కాలయాపన చేసింది. ఇంటర్​ రిజల్ట్స్​లో అవకతవకలు జరిగాయని త్రిసభ్య కమిటీ రిపోర్టు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోలేదు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యుడైన విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్న డిమాండ్లనూ పట్టించుకోలేదు. గవర్నర్ స్పందనతో సరిపోదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నర్ నిక్కచ్చిగా వ్యవహరించాలి..” అని సంజయ్​ కోరారు. తెలంగాణలో అరాచక, నియంత పాలన కొనసాగుతోందని విమర్శించారు.

పోరాడుతూనే ఉంటం..

ఇంటర్​ స్టూడెంట్ల ఆత్మహత్యలపై సభలో మాట్లాడుతుంటే మిగతా ఎంపీలంతా ఆశ్చర్యపోయారని, ఇందరు స్టూడెంట్లు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారని ఎంపీ బండి సంజయ్​ చెప్పారు. లోక్​సభలో స్పీచ్​ తర్వాత ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని, చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే సమయం కూడా కేసీఆర్​కు లేదా అని ప్రశ్నించారు. విద్యార్థుల సూసైడ్​అంశాన్ని బీజేపీ హైకమాండ్​ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇంటర్​ ఫలితాల అవకతవకలపై, స్టూడెంట్ల ఆత్మహత్యలపై విచారణ జరిపించాలని రాష్ట్రపతికి, కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించేంత వరకు బీజేపీ పోరాడుతూనే ఉంటుందన్నారు.