నిజాయితీ ఉంటే కవితను సస్పెండ్​ చెయ్

నిజాయితీ ఉంటే కవితను సస్పెండ్​ చెయ్
  • దీక్ష చేయకుండా.. యాత్ర సాగకుండా.. సంజయ్​ అరెస్ట్
  • జనగామ జిల్లా పామునూరులో తీవ్ర ఉద్రిక్తత
  • బీజేపీ కార్యకర్తలపై కేసులకు 
  • నిరసనగా దీక్షకు సంజయ్​ ప్రయత్నం
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఇరువర్గాల మధ్య పెనుగులాట.. 
  • పలువురు కార్యకర్తలకు గాయాలు
  • కట్టెలతో దాడికి వచ్చిన టీఆర్​ఎస్​
  • సంజయ్​ను కరీంనగర్​ తరలించి 
  • హౌస్​ అరెస్ట్​ చేసిన పోలీసులు
  • పాదయాత్ర చేయొద్దంటూ నోటీసులు
  • నిజాయితీ ఉంటే కవితను సస్పెండ్​ చెయ్
  • నీ బిడ్డకో న్యాయం.. ఇతరులకో న్యాయమా?
  • కేసీఆర్​పై బండి సంజయ్​ ఫైర్​
  • లిక్కర్​ స్కామ్​ బయటకు రాకూడదనే దాడులు
  • పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
  • దాడులు, అరెస్టులపై నేడు నిరసనలకు పిలుపు
  • పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే అడ్డుకున్నరు: కిషన్​ రెడ్డి
  • కేసీఆర్​ భయపడుతున్నరు
  • అందుకే సంజయ్​ యాత్రను అడ్డుకున్నరు: తరుణ్​ చుగ్​
  • టీఆర్​ఎస్​ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక

జనగామ/కరీంనగర్, వెలుగు:  బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ ధర్మదీక్ష, పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం ఉదయమే జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​ మండలం పామునూరుకు పోలీసులు భారీగా చేరుకొని.. సంజయ్​ను అరెస్ట్​ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, పెనుగులాట జరిగింది. ఇదే టైమ్​లో సంజయ్​ దీక్ష శిబిరంపై దాడికి పెద్ద ఎత్తున టీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు ఉప్పుగల్లు వైపు నుంచి కట్టెలతో దూసుకువచ్చారు. దీంతో బండి సంజయ్​ను, బీజేపీ లీడర్లను పోలీసులు అరెస్టు చేసి.. అక్కడి నుంచి తరలించారు. పామునూరు వద్ద టీఆర్​ఎస్​ నేతలు నాలుగు గంటల పాటు బీభత్సం సృష్టించారు. ఎక్కడికక్కడ బీజేపీ ఫ్లెక్సీలను చించి వేశారు. ధర్నాకు దిగారు. యాత్ర చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. బండి సంజయ్​ను పోలీసులు కరీంనగర్​లోని ఆయన ఇంటికి తరలించి.. అక్కడ హౌస్​ అరెస్ట్ చేశారు. జనగామ జిల్లాలో పాదయాత్రను వెంటనే నిలిపివేయాలంటూ ఆయనకు వర్ధన్నపేట ఏసీపీ నోటీసులు పంపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ యాత్ర ఆపేది లేదని సంజయ్​ తేల్చిచెప్పారు.  

తీవ్ర ప్రతిఘటన

ఢిల్లీ లిక్కర్​ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేయాలంటూ సోమ వారం హైదరాబాద్​లోని ఆమె ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు నిరసన తెలుపగా.. పోలీసులు అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జనగామ జిల్లాలో పాదయాత్రలో ఉన్న సంజయ్​.. దీన్ని ఖండిస్తూ  మంగళవారం ఉదయం 10 గంటలకు పామునూరు బస పాయింట్​ వద్ద ధర్మదీక్షకు దిగుతానని సోమవారం రాత్రి ప్రకటించారు. దీక్షను టీఆర్​ఎస్​ నేతలు అడ్డుకునే చాన్స్​ ఉందని పోలీసులు మంగళవారం ఉదయమే దీక్ష స్థలానికి భారీగా చేరుకున్నారు. దీక్షతో పాటు, పాదయాత్రను అడ్డుకున్నారు.  సంజయ్​ను అరెస్ట్​ చేసి పోలీస్​ వాహనం ఎక్కించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్​ వాహనాన్ని ముందుకు కదలనివ్వకుండా సుమారు గంట పాటు బీజేపీ కార్యకర్తలు  అడ్డుకున్నారు. వారిని పోలీసులు ఈడ్చి పడేశారు. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకోగా.. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. బండి సంజయ్​ మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వాహనం గ్లాస్​ డోర్​ పూర్తిగా మూసేశారు. కార్యకర్తల ప్రతిఘటన మధ్యనే బండి సంజయ్​ను వాహనంలో తొలుత వరంగల్​ వైపు తీసుకెళ్లారు. తర్వాత  చిల్పూరు, హుస్నాబాద్​ మీదు గా కరీంనగర్​ తరలించి హౌస్​ అరెస్ట్​ చేశారు.

కట్టెలతో దూసుకొచ్చిన టీఆర్​ఎస్ శ్రేణులు

బండి సంజయ్​ దీక్ష, యాత్రను అడ్డుకునేందుకు టీఆర్​ఎస్​ శ్రేణులు పెద్ద ఎత్తున పామునూరు బసపాయింట్​ వైపు దూసుకువచ్చాయి. మంగళవారం సంజయ్​ యాత్ర స్టేషన్​ ఘన్​పూర్​ మండలం పామునూరు బస పాయింట్​ నుంచి మొదలై జఫర్​ ఘడ్​ మండలంలోని ఉప్పుగల్లు, కూనూరు, గర్మిళ్లపల్లి వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర సాగాల్సి ఉంది. యాత్ర కొనసాగే ఉప్పుగల్లు స్టేజీ వద్దకు ఉదయమే వివిధ మండలాల టీఆర్​ఎస్​కార్యకర్తలు చేరుకొని.. అక్కడి నుంచి పామునూరు బసపాయింట్​ వైపు పెద్ద పెద్ద కట్టెలను చేతబట్టుకొని దూసుకు వచ్చారు. అప్పటికే బండి సంజయ్​ సహా బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్​ చేసి ఇతర ప్రాంతాలకు తరలించారు. అయినా శాంతించని టీఆర్​ఎస్ శ్రేణులు శిబిరం గుడారాలను తగులబెట్టేందుకు సిద్ధమవగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు ఉప్పుగల్లు, పామునూరు రోడ్డుపై ధర్నాకు దిగారు. దారి వెంట ఉన్న బీజేపీ ఫ్లెక్సీలను చించివేశారు. చెప్పులు చూపిస్తూ బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉద్రిక్తత నెలకొంది. కూనూరులో 4 కార్ల అద్దాలు ధ్వంసం చేశారు.  కాగా, బీజేపీ తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలని టీఆర్​ఎస్​ కేడర్​కు స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సూచించారు. 


యాత్రను ఆపేయాలంటూ ఏసీపీ నోటీసు


జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రను వెం టనే నిలిపివేయాలని పేర్కొంటూ వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాసరావు నోటీసు జారీ చేశారు. బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ కు నోటీసులు పంపారు.

సంజయ్​ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు

కరీంనగర్​లోని బండి సంజయ్​ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. జనగామ జిల్లాలో అరెస్టు చేసి సంజయ్​ను ఇంటికి తీసుకురావడానికి ముందే అక్కడికి భారీగా చేరుకున్నారు. పాదయాత్రను నిలిపివేయాలని ఏసీపీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయనను గృహనిర్భంధం చేసి.. బయటకు వెళ్లనీయడం లేదు. డీసీపీ శ్రీనివాస్, టౌన్ ఏసీపీ శ్రీనివాస్ రావుతో పాటు సీఐలు, ఎస్​ఐలు గస్తీ కాస్తున్నారు. 

నేడు రాష్ట్రవ్యాప్తంగా  బీజేపీ నిరసన దీక్షలు

రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం11గంటల నుంచి ఒంటి గంట వరకు మండల, జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర రాజధానిలో నిరసన దీక్షలు చేపట్టాలన్నారు. కరీంనగర్‌‌‌‌లోని తన నివాసంలో సంజయ్ దీక్ష చేపట్టనున్నారు.

రూట్లు మార్చి ఇంటికి తెచ్చి..!

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూరులో బండి సంజయ్ ను అరెస్ట్ చేసి వాహనంలో ఎక్కించుకున్న పోలీసులు.. నాటకీయ పరిణామాల మధ్య కరీంనగర్ లోని ఇంటికి తీసుకువచ్చి హౌస్​ అరెస్ట్​చేశారు. మొదట స్టేషన్​ ఘన్ పూర్  నుంచి  అక్కన్నపేట మీదుగా హుస్నాబాద్ కు వాహనాన్ని తరలించారు. ఇక్కడి నుంచి సిద్దిపేటకు తరలిస్తారని అందరూ భావించారు. కానీ, పోలీసులు మాత్రం బండి సంజయ్ ను తీసుకొని కరీంనగర్ వైపు వచ్చారు. బండి సంజయ్ వస్తున్నారని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు బైపాస్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. వెంటనే పోలీసులు టౌన్ లో నుంచి కాకుండా వేములవాడ బైపాస్ మీదుగా వాహనాన్ని మళ్లించారు. ఎటువైపు తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అటు ఇటు తిప్పి చివరికి జ్యోతినగర్ లోని సంజయ్ ఇంటికి తీసుకువచ్చారు.