బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు పరీక్ష అభ్యర్థుల అరెస్టును ఖండిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అరెస్టు చేసిన యువ మోర్చా కార్యకర్తలు, పోలీసు పరీక్షా అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎంను కలవడానికి వెళితే బీజేవైఎం, పోలీస్ పరీక్ష అభ్యర్థులపై పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసు రిక్రూర్మెంట్ పరీక్షల్లో ఉన్న అసంబద్ధ నిబంధనలు మార్చాలని మొరపెట్టుకున్నా విరకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షా నిబంధనను మార్చాలని తానే స్వయంగా సీఎం గారికి లేఖ రాసినా స్పందించలేదని విమర్శించారు.
2 లక్షల మంది పోలీస్ అభ్యర్థుల విన్నపాన్ని వినే సమయం సీఎంకు లేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. వీళ్ళ బాధలు వినలేనంత తీరిక లేకుండా సీఎం ఏం ఘనకార్యం చేస్తున్నారని విమర్శించారు. బీజేవైఎం కార్యకర్తల పట్ల విచక్షణా రహితంగా వ్యవహరించిన పోలీసులపై చర్య తీసుకోవాలన్న బండి సంజయ్.. వెంటనే పోలీసు పరీక్షల్లోని నిబంధనలను సవరించి అన్యాయానికి గురైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. పరీక్ష రాసిన వేలమంది రోడ్డు మీదకు రావలసిన పరిస్థితి ఎందుకొచ్చిందో సీఎం అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పోలీసు రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు.