మల్లన్న అరెస్ట్​ దుర్మార్గం: బండి సంజయ్​

మల్లన్న అరెస్ట్​ దుర్మార్గం: బండి సంజయ్​
  • తీన్మార్ మల్లన్న అరెస్టు
  • పోలీసుల అదుపులో 
  • తెలంగాణ విఠల్, క్యూ న్యూస్​ సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: తీన్మార్​మల్లన్నను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను ఎక్కడికి తరలించారనే విషయం చెప్పడం లేదని చానెల్ సిబ్బంది తెలిపారు. ఆదివారం క్యూ న్యూస్​ఆఫీసులో కంప్యూటర్లు, ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేస్తూ సిబ్బందికి పట్టుబడ్డ సాయి కిరణ్​గౌడ్​ మల్లన్న, క్యూ న్యూస్ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. తనను తీవ్రంగా కొట్టి, హింసించి హత్య చేసేందుకు ప్రయత్నించారని అతను ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మల్లన్న, తెలంగాణ విఠల్, క్యూ న్యూస్​సిబ్బందిపై పోలీసులు ఐపీసీ 307 సెక్షన్​కింద హత్యాయత్నం, పలు నాన్​బెయిలబుల్​సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మల్కాజిగిరి డీసీపీ జానకి ధారవత్, మల్కాజిగిరి ఏసీపీ, ఎల్బీ నగర్ ఏసీపీ మేడిపల్లి పోలీసు స్టేషన్ చేరుకొని మేడిపల్లి, ఉప్పల్, ఘటకేసర్ పీఎస్ లకు చెందిన సీఐలతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితి సమీక్షిస్తున్నారు క్యూ న్యూస్​ఆఫీసు వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఇద్దరిని వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారా అని ఫైర్ అయ్యారు. దొంగల్లా వచ్చి ఎత్తుకుపోతారా.. ఖబడ్దార్ కేసీఆర్.. బేషరతుగా విడుదల చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. విఠల్ ఆరోగ్యం బాగోలేదు.. ఆయనకు ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యతన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోందన్నారు.