
హైదరాబాద్: నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ చేస్తున్న హత్యలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తొలి సంతకం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్క దాన్ని కూడా ముఖ్యమంత్రి అమలుచేయకపోవడం వల్లే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. స్వరాష్ట్రం సాధించుకుని ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాల్లేక యువత ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్రంగా కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్న సంజయ్.. బీజేపీ చేస్తున్న పోరాటంలో యువత చేతులు కలపాలని కోరారు. అంతా కలిసి కేసీఆర్ అంతు చూద్దామని పిలుపునిచ్చారు.