కాంగ్రెస్​ అభ్యర్థులకు కేసీఆర్ ఆర్థిక సాయం : బండి సంజయ్​

కాంగ్రెస్​ అభ్యర్థులకు కేసీఆర్ ఆర్థిక సాయం : బండి సంజయ్​

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను సీఎం కేసీఆర్​ఎంపిక చేస్తున్నారని, వారికి ఆర్థిక సాయం కూడా చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో బీజేపీ మహాజన్​ సంపర్క్​ అభియాన్​ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్​ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు.

భవిష్యత్తులో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డే చెప్పారని తెలిపారు. రాష్ర్టపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రతిపాదించినప్పుడు ఆమెను ఓడించాలని రెండు పార్టీలు చూశాయని, కర్ణాటక ఎన్నికల్లోసైతం కాంగ్రెస్​కు కేసీఆర్​ ఆర్థిక సాయం చేశారని ఆరోపించారు.

రాష్ట్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి..

తెలంగాణ అభివృద్ధికి బీఆర్​ఎస్​ఏం చేసిందో చెప్పడానికి తమతో బహిరంగ చర్చకు రావాలని , కేంద్ర ప్రభుత్వం నిధులివ్వలేదని నిరూపించాలని బండి సంజయ్​ డిమాండ్​చేశారు.  బీఆర్​ఎస్​ సర్కార్​ కేంద్ర నిధుల్ని దారి మళ్లిస్తోందని ఆరోపించారు.  కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్ల నిధులు కేటాయించినట్లు బండి తెలిపారు.

రుణ మాఫీ చేయాలి...

సీఎం కేసీఆర్​ ఎన్నికలలో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని 2018 లో హామీ ఇచ్చి.. ఇప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేయాలని డిమాండ్​ చేశారు. ధరణిలో లోపాలు ఉన్నాయని.. బీజేపీ అధికారంలోకి రాగానే ధరణిలో లోపాలు సరిచేసి పబ్లిక్​ ఇబ్బందులు తీరుస్తామన్నారు. 

అసలు హోం మంత్రి ఉన్నారా?

మహిళల దుస్తులపై రాష్ట్ర హోం మంత్రి మహమూద్​ అలీ చేసిన వ్యాఖ్యలపై బండి స్పందిస్తూ.. అసలు రాష్ర్టంలో హోం మంత్రి ఉన్నాడా, హత్యలు, హత్యాచారాలు జరుగుతుంటే ఆయన ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.  హిందూ ప్రజలను అవమానించేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. 18 రాష్ర్టాల్లో బీజేపీ గెలిచినప్పుడు మాట్లాడని కాంగ్రెస్​ నేతలు, కర్ణాటకలో గెలవగానే ఎగిరెగిరిపడుతున్నారన్నాki. కన్నడ నాట కాంగ్రెస్​ గెలవగానే మత మార్పిడి బిల్లు తెచ్చారని, దీంతో మళ్లీ హిందూ సమాజం ఏకమవుతోందని అన్నారు. టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి 45 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్​ గెలుస్తుందనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.  

రాష్ర్టంలో  బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వస్తుందని తెలిసే సీఎం కేసీఆర్​ మళ్లీ కాంగ్రెస్​ పార్టీని పైకి లేపాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ని ఎంత లేపిన లేచే స్థితిలో లేదని విమర్శించారు.  కేసీఆర్​ ఇప్పుడు ప్రధాని మోడీని తన మిత్రుడిగా చెప్పుకుంటున్నారని అది ఎలాగో తెలియజేయాలని డిమాండ్​ చేశారు.  తమ పార్టీ సిద్దాంతాలను, మోడీ నాయకత్వాన్ని నమ్మి పార్టీలోకి వచ్చే వారినే స్వాగతిస్తామని, ఎవరో రావాలని తాము చూడట్లేదని పేర్కొన్నారు. బీజేపీలోంచి పలువురు వెళ్లిపోతున్నారంటూ సోషల్​ మీడియాలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ.. తమ పార్టీలోంచి ఎవరూ వెళ్లబోరని తెలిపారు.