కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

మహబూబ్ నగర్ : పాలమూరు నుంచి వలసలు లేవని సీఎం కేసీఆర్ అంటున్నారని, కానీ ఇప్పటికీ పాలమూరు ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పాలమూరు నుంచి వలసలు లేవని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలంటూ సీఎం కేసీఆర్ కు చాలెంజ్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు జిల్లాను పచ్చగా చేస్తామన్నారు. దేవరకద్రలో బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర సభ నిర్వహించింది. 

పాలమూరులో బీజేపీ ఎక్కడుందని టీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. పాలమూరులో ప్రాజెక్టుల నిర్మాణాలు కాంగ్రెస్ , టీఆర్ఎస్ వల్ల పూర్తికాలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వండని కోరారు. తాము ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది జరగలేదన్నారు. చెక్ డ్యాంలు, ఇసుక కాంట్రాక్టులతో టీఆర్ఎస్ నాయకులు కోట్లు సంపాదించుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ కుటుంబంలో ఐదు మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లేనని, కాంగ్రెస్, టీఆర్ఎస్ వేరని చెప్పి జనాన్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సెంటిమెంట్ తో జనాన్ని రెచ్చగొట్టి, ఓట్లు రాబట్టుకోవాలనుకోవడం కేసీఆర్ నైజమన్నారు.