కేసీఆర్ లేకుంటే కేటీఆర్‌‌‌‌ది బిచ్చపు బతుకే: బండి సంజయ్

కేసీఆర్ లేకుంటే కేటీఆర్‌‌‌‌ది బిచ్చపు బతుకే: బండి సంజయ్
  • కేటీఆర్‌‌‌‌కు అహంకారం
  • ఎంపీగా గెలిపిస్తే ఏం చేశానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నరు
  • మూడేండ్లలో 8 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చినట్లు ప్రకటన
  • కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

కరీంనగర్, వెలుగు :  మంత్రి కేటీఆర్‌‌‌‌కు అహంకా రం ఎక్కువైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను సన్నాసులంటావా? అంటూ కేటీఆర్‌‌‌‌పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ లేకుంటే ఆయనది బిచ్చపు బతుకు అయ్యేదని విమర్శించారు. ‘‘కేసీఆర్, కేటీఆర్ కథ ముగిసింది. వాళ్ల సభలకు జనం వచ్చే పరిస్థితి లేదు. మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాస్తవ నివేదిక ఇస్తే తప్పుపడుతున్న కేసీఆర్ కొడుకుకు సిగ్గుండాలె” అని దుయ్యబట్టారు. బీజేపీ కరీంనగర్ అభ్యర్థిగా సోమవారం బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు మహాశక్తి ఆలయంలో ఆయన పూజలు చేశారు. తన తల్లి శకుంతలమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. 

తర్వాత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్ రెడ్డి, ధర్మపురి అసెంబ్లీ అభ్యర్థి ఎస్.కుమార్, చీకోటి ప్రవీణ్‌‌తో కలిసి ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకుని, బైక్ ర్యాలీగా కలెక్టరేట్‌‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ధర్మరక్షణ కోసం చివరి శ్వాస దాకా పోరాడుతూనే ఉంటా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తిరిగాను. పార్టీని పరుగులు పెట్టించి హిందూ ఓటు బ్యాంకును ఏకం చేశాను. రైతుల కోసం కాళ్లు, చేతులు విరిగినా లెక్కచేయలేదు. టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే నిరుద్యోగుల కోసం పోరాడి జైలుకు పోయాను. 317 జీవో పేరుతో ఉద్యోగులను చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తే వాళ్ల పక్షాన జైలుకుపోయిన. స్టేట్​లో ఏ వర్గానికి అన్యాయం జరిగినా వాళ్ల పక్షాన పోరాడా. నాపై 30కి పైగా కేసులు పెట్టినా లెక్క చేయలేదు’’ అని చెప్పారు.

ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చారా?

ఎంపీగా గెలిపిస్తే ఏం చేశానని కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, మూడేళ్లలో 8 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చానని సంజయ్ తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులు కేంద్రానివేనని, రేషన్ బియ్యం సహా పల్లెల్లో, మున్సిపాలిటీలో జరిగే అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనని స్పష్టం చేశారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. సివిల్ సప్లయ్స్ మంత్రిగా ఉండి ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చాడా? స్మార్ట్ సిటీ నిధుల్లో కమీషన్లు తీసుకున్నాడు” అని ఆరోపించారు. అన్ని పార్టీలకు కరీంనగర్ ప్రజలు అవకాశమిచ్చారని, ఈ ఒక్కసారి తనకు అవకాశమివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సొంతిల్లు లేని బండి సంజయ్

బీజేపీ తరఫున కరీంనగర్ లో రెండుసార్లు కార్పొరేటర్ గా, ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తున్న  బండి సంజయ్ కుమార్ కు ఇప్పటి వరకు సొంతిల్లు లేదు. తన పేరిటగానీ, తన భార్య, కుమారుల పేరిటగానీ సొంతిల్లు లేదని తాజా ఎన్నికల అఫిడవిట్ లో ఆయన వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయనపై 5 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉండగా.. గత ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో 30 నమోదయ్యాయి. ఇందులో ప్రధానంగా టెన్త్ పేపర్ లీకేజీ కేసు, గుర్రంపోడు భూసమస్యపై ఆందోళన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ర్యాలీల నిర్వహణ, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం, కరోనా రూల్స్ బ్రేక్ తదితర ఆరోపణలతో నమోదైన కేసులు ఉన్నాయి. 

సంజయ్ కరీంనగర్ సరస్వతి శిశు మందిర్ లో టెన్త్, మధురై కామరాజ్ యూనివర్సిటీలో ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేశారు. కాగా, బండి సంజయ్ పేరిట 2018లో రూ.2.55 లక్షల విలువైన చరాస్తులు ఉండగా, ఆయన భార్య అపర్ణ పేరిట రూ.19.50 లక్షల విలువైన చరాస్తులు ఉండేవి. అప్పటి వరకు మొత్తం ఇద్దరి పేరిట కలిపి రూ.22.05 లక్షల ఆస్తి ఉంది. ఐదేండ్లలో ఇద్దరి పేరిట చరాస్తులు రూ.79.51 లక్షలకు పెరిగాయి. ఇందులో సంజయ్ పేరిట కొనుగోలు చేసిన రూ.29 లక్షల విలువైన ఫార్చునర్ వెహికల్, మరో 2.20 లక్షల విలువైన కారు, టూ వీలర్ తో పాటు బ్యాంకు బ్యాలెన్స్ రూ.3.63 లక్షలు, రూ.6 లక్షల విలువైన ఎల్ఐసీ బాండ్, చేతిలో ఉన్న లక్షన్నర నగదుతో కలిపితే రూ.42.33 లక్షల చరాస్తులు ఉన్నాయి.