
హుజూరాబాద్, వెలుగు: అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘‘ఒకాయనేమో అసెంబ్లీలో మీ సంగతి తేలుస్తానంటడు.. ఇంకొకాయనేమో నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవంటడు.. అసెంబ్లీ ఒకరినొకరు తిట్టుకోవడానికా? మీరు తిట్టుకోవాలంటే పరేడ్ గ్రౌండ్ నేనే బుక్ చేస్తా.. అక్కడ తిట్టుకుంటారో.. కొట్టుకుంటారో మీ ఇష్టం అంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై ఫైర్ అయ్యారు.
గావ్ ఛలో అభియాన్‌లో భాగంగా బుధవారం హుజూరాబాద్‌లోని రంగాపూర్ గ్రామంలో కేంద్ర నిధులతో చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం చేనేత కార్మికులతో మాట్లాడారు. ప్రజలకిచ్చిన హమీలపై కాంగ్రెస్, గత ప్రభుత్వ తప్పిదాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఒకరికొకరు తిట్టుకునే కార్యక్రమానికి తెరతీశారని సంజయ్ అన్నారు. కాగా, సీఎంను చెప్పుతో కొడతాననడం అహంకారానికి నిదర్శనమన్నారు.