
సింగరేణి సంస్థ ప్రైవేటీకరణపై టీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆమోదం లేకుండా ప్రైవేటీకరణ మాటే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాసిన లేఖను బండి సంజయ్ విడుదల చేశారు. నల్ల బంగారానికి నెలవైన సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తున్నారంటూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సంస్థలో రాష్ట్ర వాటా 51శాతం కాగా.. కేంద్రం వాటా 49 శాతమేనన్న విషయాన్ని గుర్తుచేసిన ఆయన.. రాష్ట్ర ఆమోదం లేకుండా సింగరేణిని ప్రైవేటీకరించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. సింగరేణి ఎన్నికలు వస్తుండటంతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఆడే అబద్దాలకు అంతూపొంతూ లేకుండా పోయిందని సంజయ్ విమర్శించారు.
బొగ్గు గనుల వేలం విషయంలో కేంద్రం మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 2015 ప్రకారం పాదర్శకంగా వేలం వేస్తోందని బండి సంజయ్ చెప్పారు. అయితే 2020లో కమర్షియల్ మైనింగ్ అంశాన్ని చట్టంలో చేర్చడం వల్ల కేవలం వేలం ద్వారా మాత్రమే బొగ్గు బ్లాకులు కేటాయిస్తున్నారని స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతానికి చెందిన 4 బ్లాకులను వేలం వేయగా ఎవరూ బిడ్లు వేయలేదని, సింగరేణి సంస్థ ఆ బ్లాకుల కోసం దరఖాస్తు చేసుకుని పొందవచ్చని అన్నారు. సీఎం కేసీఆర్ చెబుతున్న అబద్దాలను ఆ ప్రాంత ప్రజలు, కార్మికులు నమ్మొద్దని సంజయ్ కోరారు.
సీఎం కేసీఆర్ రోజుకో మాట.. పూటకో అబద్దమాడుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. జిత్తులమారి ఎత్తులతో రైతులు, విద్యార్థులు, కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులను నట్టేట ముంచిన సీఎం కేసీఆర్.. తన తప్పిదాలను కేంద్రంపై మోపి బీజేపీని బద్నాం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్న టీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరుచుకొని వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.