లిక్కర్ పైసలు పంచుకునేందుకే నేతలు మీటింగ్ కొచ్చిన్రు : బండి సంజయ్

లిక్కర్ పైసలు పంచుకునేందుకే నేతలు మీటింగ్ కొచ్చిన్రు  : బండి సంజయ్

కేసీఆర్ దగ్గరున్న లిక్కర్ స్కాం పైసల కోసమే నేతలు బీఆర్ఎస్ మీటింగ్ కు వచ్చిన్రని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మీటింగ్ పేరుతో వాళ్లు ఆ ముచ్చట్లే మాట్లాడుకున్నరని అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పైసల కోసమే బీఆర్ఎస్ సభకు వచ్చిండని బండి ఆరోపించారు. ఖమ్మం సభకు వచ్చిన నలుగురు నేతలు నాలుగు స్కాంలలో నిందితులుగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ సభకు వచ్చిన ఒక్క నేత కూడా ఆ పార్టీ గురించి మాట్లాడలేదని సటైర్ వేశారు. కేంద్రంలో వచ్చేది ఆప్ సర్కారేనని కేజ్రీవాల్ సభలో ప్రకటించారని, అలాంటప్పుడు కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ కేంద్రంలో అధికారం ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ గురించి తెలిసే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్ సభకు హాజరుకాలేదని బండి సంజయ్ చెప్పారు. జనం ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్ప.. బీఆర్ఎస్ సభను పట్టించుకోలేదని అన్నారు.

డిస్కంలకు బకాయిలు చెల్లించు..

తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని బండి సంజయ్ అన్నారు. పొలం దగ్గర ఫ్రీ కరెంట్ పేరు చెప్పి.. ఇంటి మీటర్లకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.  ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్.. ముందు డిస్కంలకు  బకాయిలు చెల్లించాలని సూచించారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీతో కేసీఆర్ జతకట్టడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. దళితులను వంచించిన కేసీఆర్ కు వాళ్ల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అసలు దళితులకు కేసీఆర్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. 

కొత్తగా మాట్లాడిందేమి లేదు..

బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమతి అని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఒక జోకర్ అని చురకలంటించారు.  ఖమ్మం సభలో కేసీఆర్ కొత్తగా మాట్లాడిందేం లేదని అన్నారు. కేసీఆర్ వేషం, భాష తుపాకి రాముడు మాటల్ని గుర్తుచేస్తాయని సటైర్ వేశారు. కరోనా సమయంలో సాయం కోరిన జర్నలిస్టులను పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానంటూ వాళ్లను వంచించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ , అజాంజాహీ మిల్లులను తెరిపించి, ఆ తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలని సూచించారు.