
భారత్ రాజ్యాంగం మార్చాలంటూ సీఎం KCR చేసిన కామెంట్స్ పై మండిపడుతున్నాయి విపక్షాలు, దళిత, ప్రజా సంఘాలు. కొత్త రాజ్యాంగం కోసం తాను ప్రతిపాదిస్తున్నట్టు సీఎం చేసిన కామెంట్స్ పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగాన్ని కాదు మిమ్మల్నే మార్చాలంటూ కేసీఆర్ పై మండిపడుతున్నారు విపక్ష నేతలు. మొదటి నుంచి కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని.... ఇప్పుడు రాజ్యాంగం మార్చాలంటూ కొత్త కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజ్యాంగంతో పాటు ప్రధాని మోడీ మీద విమర్శలు చేసిన KCRపై మండిపడ్డారు బీజేపీ నేతలు. ఢిల్లీలో తెలంగాణ భవన్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా భీందీక్షలు చేస్తామని ప్రకటించారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. ఉదయం 10 గంటల నుంచి దీక్షలు మొదలు పెట్టాలని కేడర్ కు సూచించారు. ఢిల్లీలో రాజ్ ఘాట్ దగ్గర మౌనదీక్షకు కూర్చోనున్నారు సంజయ్. హైదరాబాద్ స్టేట్ ఆఫీస్ లో జరిగే నిరసన దీక్ష ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు హాజరుకానున్నారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన కామెంట్స్ కు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ, రేపు 48 గంటల పాటు గాంధీభవన్ లో నిరసన దీక్షలు చేస్తామన్నారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రేవంత్. సీఎం కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. దీనిపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళనలు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రజా సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసనలు తెలుపుతున్నారు.