స్కిల్ వర్సిటీలో రేవంతే ఫస్ట్ చేరాలి : బండి సంజయ్

స్కిల్ వర్సిటీలో రేవంతే ఫస్ట్ చేరాలి : బండి సంజయ్
  •     రాజకీయాలపై అక్కడ కొత్త కోర్సు పెట్టాలి: బండి సంజయ్
  •     సీఎంకు రాజకీయ నైపుణ్యం బాగా తగ్గిందని ఎద్దేవా

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ నైపుణ్యం బాగా లోపించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్  ఎద్దేవా చేశారు. స్కిల్  యూనివర్సిటీలో పొలిటికల్  సైన్స్‌‌పై ఒక కొత్త కోర్సు పెట్టాలని, అందులో జాయిన్  అయ్యే మొదటి స్టూడెంట్  రేవంతే కావాలని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని బ్రిటిష్  జనతా పార్టీ అని సంబోధించడంపై బండి సంజయ్  సోమవారం ఎక్స్  వేదికగా స్పందించారు. 

‘‘బీజేపీని బ్రిటిష్  జనతా పార్టీ అంటున్న రేవంత్ రెడ్డి.. అసలు కాంగ్రెస్  పార్టీని స్థాపించిందే ఒక బ్రిటిష్  అధికారి అన్న చరిత్రను మర్చిపోతే ఎట్లా? ఒకప్పుడు బ్రిటిష్  వాళ్లు పెట్టిన పార్టీ.. ఇప్పుడు సోనియా గాంధీ చేతిలో పడ్డాక ఐఎన్‌‌సీ కాస్తా ‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’ గా మారింది. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్  పార్టీని రద్దు చేయాలని గాంధీ చెప్పారు. ఇన్నేళ్లకు ప్రజలు కాంగ్రెస్‌‌ను తిరస్కరిస్తూ గాంధీ ఆశయాన్ని నెరవేరుస్తున్నారు” అని సంజయ్  వ్యాఖ్యానించారు. ‘విభజించి పాలించు’ అనేది కాంగ్రెస్  సిద్ధాంతమని, ఓట్ల కోసం కులం, మతం పేరుతో జనాన్ని ఆ పార్టీ నేతలు విడదీస్తున్నారని ఆయన ఆరోపించారు.