
నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. గుండెగాం సమీపంలో వ్యవసాయ కూలీలతో మాట్లాడిన బండి సంజయ్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు, పెన్షన్లు రావడం లేదని కూలీలు తమ సమస్యలను వివరించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అందరికి అండగా ఉంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఉపాధి హామీ కింద కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తోందని ఆయన చెప్పారు. ఆ నిధులను కూడా కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో పెద్దల రాజ్యం పోవాలి.. పేదల రాజ్యం రావాలి అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో పేదోళ్ల రాజ్యం వస్తేనే.. ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని బండి సంజయ్ చెప్పారు.
అంతకుముందు గుండెగాంలోకి ప్రవేశించిన బండి సంజయ్కు గ్రామస్తుల నుంచి స్వాగతం లభించింది. వెల్కమ్ టూ గుండెగాం అని పూలతో నేలపై రాసి గ్రామస్తులు స్వాగతం పలికారు. బండి సంజయ్ పై పూలవర్షం కురిపిస్తూ ఆహ్వానించారు. ప్రజా సంగ్రామ యాత్రకు.. మహిళలు హారతులతో స్వాగతం పలుకగా.. గ్రామ యువత టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.