అవినీతి ఆరోపణలతో టీఆర్ఎస్ లీడర్స్ భయపడుతున్నరు

అవినీతి ఆరోపణలతో టీఆర్ఎస్ లీడర్స్ భయపడుతున్నరు

మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) వెల్లడించారు. ఉప ఎన్నికలు కోరుకున్నది సీఎం కేసీఆర్ అని, ఉప ఎన్నిక ఎవరు కోరుకున్నారని వారు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ కుటుంబంపైనే అవినీతి ఆరోపణలు వస్తుండడంతో తమను ఎవరు కాపాడతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు భయపడుతున్నారని విమర్శించారు. భువనగిరి జిల్లాలో నాలుగో రోజు ప్రజా సంగ్రామ పాదయాత్ర (praja sangrama yatra) ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

నాగార్జున సాగర్, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 6 నెలల పాటు సీఎం కేసీఆర్ టైం పాస్ చేశాడన్నారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక పేరిట మళ్లీ 6 నెలలు టైం పాస్ చేస్తాడని విమర్శించారు. చికోటి ప్రవీణ్ (క్యాసినో) వ్యవహారంలో సీఎం కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణనిచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమతో టచ్ లో ఉన్నారని తాను అనలేదని.. అనని మాటను అన్నట్టు బ్రేకింగ్స్ పెట్టొద్దని మీడియాకు సూచించారు. అభివృద్ధికి సంబంధించిన నిధుల విషయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని మోడీని కలుస్తుంటారని తెలిపారు.