టీఆర్ఎస్ పై బండి సంజయ్ ధ్వజం

టీఆర్ఎస్ పై బండి సంజయ్ ధ్వజం
  •     జనగామ పట్టణానికి చేరుకున్న పాదయాత్ర
  •     ప్రశాంతంగా ముగిసిన బహిరంగ సభ
  •     ఊపిరి పీల్చుకున్న పోలీసులు

జనగామ అర్బన్, రఘునాథపల్లి, వెలుగు: ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే.. ప్రతీ కార్యకర్త ఒక చత్రపతి శివాజీలా, భగత్ సింగ్​లా మారి తిరగబడతామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ధ్వజమెత్తారు. గురువారం నెల్లుట్ల నుంచి జనగామ పట్టణానికి పాదయాత్ర చేరుకోగా.. ​చౌరస్తాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. వేల సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చారు. జనగామలో అభివృద్ధి కుంటుపడిందని, టీఆర్ఎస్ నాయకులు పోలీసులను అడ్డంపెట్టుకుని, గూండాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఆసుపత్రిలో ఎమ్మారై, సీటీ స్కాన్ కూడా పనిచేయడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో జనగామ గడ్డపై బీజేపీ జెండా ఎగరేస్తామన్నారు.

రాక్షస పాలనను అంతం చేయాలి: దశమంతరెడ్డి

రాష్ట్రంలో టీఆర్ఎస్ రాక్షస పాలనను ప్రజలంతా ఏకమై అంతం చేయాలని జనగామ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి పిలుపునిచ్చారు. జనగామ ఎమ్మెల్యే ఒక డేరా బాబా అని, ఆయన కబ్జాలకు, దందాలకు అంతే లేకుండా పోయిందన్నారు. ఫ్లెక్సీలు చింపేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఉన్న ప్రేమను తొలగించలేరని తెలిపారు. బీజేపీ కార్యకర్తలను టచ్ చేస్తే.. మాడి మసై పోతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్లమెంటరీ కార్యాలయ సెక్రటరీ కామర్స్ బాలసుబ్రమణ్యం,  బీజేపీ నాయకులు ముక్కెర తిరుపతిరెడ్డి, -గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కేవీఎల్ఎన్​ రెడ్డి, ఉడుగుల రమేశ్, బనుక శివరాజ్ యాదవ్​, మహంకాళి హరిశ్చంద్ర గుప్త, బొట్ల శ్రీనివాస్, సౌడ రమేశ్​ తదితరులున్నారు.

ప్రశాంతంగా ముగిసిన సభ..

జనగామ సమీపంలోని దేవరుప్పులలో బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ దాడి చేయగా.. జనగామ పట్టణంలోనూ ఆ సీన్ రిపీట్ అవుతుందని ఇంటలిజెన్స్ వర్గాలు భావించాయి. దీనికి తోడు కొందరు దుండగులు ఎక్కడికక్కడ బీజేపీ ఫ్లెక్సీలు చింపారు. దీంతో పోలీసులు గురువారం ఉదయం నుంచే పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు వైన్స్ లు, బార్లను మూసివేయించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రానికి పాదయాత్ర జనగామ పట్టణానికి చేరుకోగా.. రాత్రి 10గంట వరకు సభ సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బహిరంగ సభ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.కాగా, నేడు పాదయాత్ర రెడ్డి భవన్ నుంచి మొదలై చీటకోడూరు, చౌడారం, రామచంద్రాగూడెం మీదుగా ఖిలాషాపూర్ వరకు సాగనుంది.