- హుజూరాబాద్, జమ్మికుంటలో బీజేపీకి అవకాశమివ్వండి: బండి సంజయ్
జమ్మికుంట, వెలుగు: హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జమ్మికుంట డిగ్రీ అండ్ పీజీ కళాశాల స్థలంలో సింథటిక్ స్టేడియం నిర్మాణానికి రూ.6.5 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కాలేజీ స్థలాన్ని బండి సంజయ్ పరిశీలించారు. స్టేడియం నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో సమావేశమై వారి సూచనలు తీసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా మోదీ ప్రభుత్వం కాగితాలకే పరిమితం కాదని.. వెంటనే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కళాశాల స్థలం కబ్జాచేసిన వ్యక్తులపై చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశిస్తానని చెప్పారు. జమ్మికుంట టౌన్‌లోని రైల్వే స్టేషన్‌ను ఎయిర్పోర్ట్ తరహాలో ఆధునీకరిస్తానని చెప్పారు. నాయిని చెరువును ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటక కేంద్రంగా మార్చి.. బోటింగ్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
టౌన్లో కిరాయిదారుల కుటుంబాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయని.. వారి విషయం కలెక్టర్, ఆర్డీఓతో మాట్లాడి వారికి స్థలాలను ఇస్తే ఎంపీ నిధులతో భవన సముదాయం నిర్మించి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ వెంకటరెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేశ్, బీజేపీ నాయకులు ఆకుల రాజేందర్, రమేశ్ పాల్గొన్నారు.
