- ఈడీఐఐ, హిట్కోస్ ఆధ్వర్యంలో ట్రైనింగ్
- కవ్వాల్ టైగర్ రిజర్వ్ నాయకపుగూడెంలో కొనసాగుతున్న శిక్షణ
- హోమ్ డెకరేటివ్స్, ఫర్నిచర్ తయారు చేస్తున్న మహిళలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం నాయకపుగూడకు చెందిన గిరిజన మహిళలు వెదురుతో అదిరిపోయే ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వివిధ రకాలైన హోమ్ డెకరేటివ్స్తో పాటు కుర్చీలు, సోఫాలు వంటి ఫర్నిచర్ తయారు చేస్తూ స్వయం ఉపాధికి బాటలు వేసుకుంటున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఇందన్పల్లి రేంజ్ పరిధిలోని ఈ గిరిజన గ్రామంలో సుమారు 70 కుటుంబాలు ఉన్నాయి. వారికి భూములు, జాగలు లేకపోవడంతో ఆడ, మగ అందరూ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు.
ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఈడీఐఐ), హైదరాబాద్ టైగర్ కన్జర్వేటివ్ సొసైటీ(హిటికోస్)ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి, ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో వెదురు ఉత్పత్తులు, ఫర్నిచర్ తయారీలో రెండు నెలల ట్రైనింగ్ ఇస్తున్నారు.
గ్రామానికి చెందిన సుమారు 50 మంది గిరిజన మహిళలు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొంటున్నారు. గత ఏడాది నవంబర్ 14న ప్రారంభమైన ట్రైనింగ్ ఈ నెల 14 వరకు కొనసాగనుంది. ట్రైనింగ్ పూర్తికాగానే ఇందన్పల్లి కేంద్రంగా వెదురు ఉత్పత్తులను తయారు చేసి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇందన్పల్లి రేంజ్ ఆఫీస్ ఆవరణలోని ఒక బిల్డింగ్‌ను ఫారెస్ట్ ఆఫీసర్లు కేటాయించారు.
అందమైన వస్తువుల తయారీ..
వెదురుతో నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులు, హోమ్ డెకరేటివ్స్తో పాటు ఫర్నిచర్ తయారీలో శిక్షణ తీసుకున్న మహిళలు వాటిని ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తయారు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. మొబైల్ స్టాండ్‌లు, పెన్ స్టాండ్‌లు, గాజుల స్టాండ్‌లు, ఆఫీస్ ట్రేలు, కుర్చీలు, సోఫాలు, ఫ్లవర్ వాజ్ లు, ఎగ్జామ్ ప్యాడ్‌లు, మడతపెట్టే రిలాక్సింగ్ చైర్లు, క్లిప్‌లు, కాఫీ ట్రేలు, ఇతర అనేక వినియోగ, అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు.
గతంలో మహిళలు కూలీ పనులను వెళ్తే రోజుకు మూడు, నాలుగు వందలు రాగా, వెదురు ఉత్పత్తుల తయారీ ద్వారా రూ.వెయ్యికి పైగా సంపాదించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తక్కువ ధరకే లభించే వెదురు ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని, ఇప్పటికే చాలా ఆర్డర్లు వచ్చాయని తెలిపారు.---
40 రకాల వస్తువులు తయారు చేస్తున్నాం..
వెదురుతో 40 రకాల వస్తువులు తయారు చేయడం నేర్పించారు. ఇప్పటికే నెలన్నర ట్రైనింగ్ పూర్తయింది. ఇప్పుడు మేము బొంగులతో పలు రకాల వస్తువులను తయారు చేస్తున్నాం. ఇకమీదట కూలీ పనులకు వెళ్లే పరిస్థితి ఉండదు. గూడెంలోనే ఉంటూ వెదురు వస్తువులను తయారు చేసుకోవచ్చు. చాలా మంది వెదురు వస్తువులు తయారు చేసివ్వాలని ఆర్డర్లు ఇస్తున్నారు. - అనసూయ, నాయకపుగూడ
గిరిజన మహిళలకు స్థిరమైన జీవనోపాధి..
వెదురు ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో సహాయపడడమే కాకుండా గ్రామీణ, అటవీ ఆధారితవర్గాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తుంది. మహిళలు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. దాంతో సమాజంలో వారికి గౌరవం పెరగడమే కాకుండా ఆత్మవిశ్వాసంతో జీవించే అవకాశం లభిస్తుంది. ఇప్పటివరకు వివిధ గ్రామాల నుంచి 280 మంది గిరిజన మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చాం. - భూక్య దేవేందర్, ఈడీఐఐ ప్రాజెక్ట్ ఆఫీసర్
ఊళ్లోనే పని దొరుకుతుంది..
నేను తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న. మొన్నటి దాకా చుట్టుపక్కల ఊళ్లల్లో చేను పనులకు పోయేది. పొద్దంతా కష్టపడితే మూడు, నాలుగు వందలు వచ్చేవి. ఇప్పుడు వెదురుతో వస్తువుల తయారీ నేర్చుకున్న. దీంతో రోజుకు వెయ్యి రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. పనుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేదు. మా గూడెంలో మిగతా వాళ్లకు కూడా నేర్పిస్తే అందరికీ పని దొరుకుతుంది.- యశోద, నాయకపుగూడ
