న్యూఢిల్లీ: భారత్ పై ప్రపంచం పెట్టుకున్న నమ్మకమే అతిపెద్ద బలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ నైతికంగా, నిష్పాక్షపాతంగా, పారదర్శకంగా, డేటా గోప్యతా సూత్రాలపై ఆధారపడి ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచానికి నాయకత్వం వహించేలా మన ఏఐ స్టార్టప్ లు పని చేయాలని సూచించారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్–2026’కి ముందు భారతీయ ఏఐ స్టార్టప్ లతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెలలో భారత్.. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్’ కు ఆతిథ్యం ఇస్తున్నదని, దీని ద్వారా దేశం సాంకేతిక రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నదని పేర్కొన్నారు.
స్టార్టప్ లు, ఏఐ ఎంటర్ ప్రెన్యూర్స్ దేశ భవిష్యత్తుకు కో ఆర్టిటెక్ట్స్ అని వెల్లడించారు. ఇన్నోవేషన్ లో ఇండియాకు అపార సామర్థ్యం ఉందని చెప్పారు. ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్’ స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రత్యేకమైన ఏఐ మోడల్ ను ప్రపంచానికి ఇండియా అందించాలని వివరించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, జితిన్ ప్రసాద, సీఈఓలు, భారత్ ఏఐ స్టార్టప్ ల హెడ్ లు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కు ప్రధాని..
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుక అనేది నైతిక విలువలతో ఎన్నడూ రాజీపడని భారత మాత అసంఖ్యాక బిడ్డలను స్మరించుకోవడమేనని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ పెట్టారు. “సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ గురువారం ప్రారంభమైంది. వెయ్యేండ్ల క్రితం1026, జనవరిలో సోమనాథ్ పై మొదటి దాడి జరిగింది.
ఈ అటాక్ తర్వాత ఆలయంపై అనేక దాడులు జరిగినప్పటికి లక్షలాది మంది ప్రజల నమ్మకాన్ని తగ్గించలేకపోయాయి” అని పేర్కొన్నారు. ఆలయంలో జనవరి 11న జరిగే సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ లో మోదీ పాల్గొననున్నారు.
